టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ దెబ్బతో హాలీవుడ్ ప్రముఖ దర్శకులందరూ రాజమౌళి టాలెంటును మెచ్చుకుంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యంగా నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు మరెన్నో ప్రఖ్యాత అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో పలు అంతర్జాతీయ మీడియాకు జక్కన్న పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ క్రమంలో ది న్యూయార్క్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మతంపై ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. ‘నిజానికి నేను నాస్తికుడిని. కానీ గతంలో దేవుడిని నమ్మేవాడిని. నా ఫ్యామిలీ, అత్తామామలు, మేనమామలు అందరూ దేవుడిని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆ ప్రభావంతో నేను కూడా మతపరమైన గ్రంథాలు చదవడం, తీర్థయాత్రలకు వెళ్లడం వంటివి చేస్తూ కొన్నాళ్లు సన్యాసిలా జీవితం గడిపాను. ఆ తర్వాత క్రైస్తవ మతాన్ని అనుసరించా. బైబిల్ చదవడం, చర్చికి వెళ్లడం చేసేవాడిని. అయితే ఇవన్నీ మతం అనేది ఒకరకమైన దోపిడీగా నాకు అనిపించేలా చేశాయ’న్నారు. అలాగే మహాభారత, రామాయణం వంటి ఇతిహాసాల ప్రభావం తనపై చాలా ఉందని చెప్పుకొచ్చారు. ‘నేను తీసే సినిమాలపై ఆ గ్రంథాల ప్రభావం ఎంతో ఉంది. మహా సముద్రాల వంటి ఈ గ్రంథాలను చదివిన ప్రతీసారి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటాను. మతం పక్కన పెడితే అందులోని డ్రామా, కథనంలోని సంక్లిష్టత, గొప్పతనం నాలో ఉండిపోయాయి’ అని వివరించాడు. అలాగే బీజేపీ ఎజెండాను నెత్తినపెట్టుకున్నారన్న విమర్శలకు జవాబిచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి గ్లింప్స్‌లో భీమ్ పాత్రను ముస్లిం టోపీ పెట్టుకున్నట్టు చూపించాను. దానికి బీజేపీ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఒక లీడర్ అయితే రాడ్డుతో కొడతానని బెదిరించాడు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని కోపగించుకున్నారు. కానీ వాస్తవానికి బాహుబలి లాంటిదే ఈ ఆర్ఆర్ఆర్ పాత్రలు. చారిత్రక నేపథ్యం ఉన్న వ్యక్తుల ప్రేరణతో కల్పితంగా తీసిన సినిమాలు అవి. నేను ఎవ్వరికీ వ్యతిరేకం కాదు ఎవ్వరికీ అనుకూలం కాదు’ అంటూ బదులిచ్చారు.