SS Rajamouli’s RRR wins Best International Film at HCA Awards.
mictv telugu

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు మరో 4 అంతర్జాతీయ అవార్డులు

February 25, 2023

 

SS Rajamouli’s RRR wins Best International Film at HCA Awards.

స్టార్ హీరోలు జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్‌లో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదలైన దగ్గర నుంచి ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ సినిమాను ఇప్పుడు మరో 4 అంతర్జాతీయ అవార్డులు వరించాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్‌ క్రిటిక్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నాలుగు కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అవార్డులు గెలుచుకుంది. ఒకేసారి 4 అవార్డులు అందుకున్న తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది.

 

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం, బెస్ట్‌ యాక్షన్‌ ఫిలిం, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ స్టంట్స్‌ కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు హెచ్‌సీఏ అవార్డులు వరించాయి. రాజమౌళి, కీరవాణి, రామ్‌చరణ్‌ ఈ అవార్డులను అందుకున్నారు. అవార్డ్ అందుకున్న తరువాత రాజమౌళి మాట్లాడారు. మామూవీలో స్టంట్స్ గుర్తించి అవార్డు ఇచ్చిన ‘హెచ్.సి.ఎ కు థాంక్స్. నేను ముందుగా మా యాక్షన్ కొరియోగ్రాఫర్లకు థాంక్స్. స్టంట్స్ కంపోజ్ చేయడానికి సాల్మన్ చాలా కష్టపడ్డాడు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సులలో కొన్ని తీయడానికి జూజీ హెల్ప్ చేశారు. ఇతర స్టంట్ కొరియోగ్రాఫర్లు కూడా ఇండియా వచ్చి మా విజన్ అర్థం చేసుకుని, మా వర్కింగ్ స్టైల్ అర్థం చేసుకుని పని చేశారు. మా హీరోలు, వండర్ ఫుల్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కు థాంక్స్. రెండు మూడు షాట్స్ లో మాత్రమే బాడీ డబుల్ ఉపయోగించాం. మిగతా యాక్షన్ సీన్లు అన్నిటిలో వాళ్ళు సొంతంగా చేశారు. ఈ క్రెడిట్ అంతా మా టీమ్ కే అంటూ మాట్లాడారు. 320 రోజుల టీమ్ సమిష్టి కృషికి ఇది నిదర్శనం. ఇక మా ఇండియా ఎన్నో కథలకు నిలయం.. భారత దేశం నుంచి అద్భుతమైన కథలు పుడతాయి అని అంటూ… మేరా భారత్ మహాన్ అని అన్నారు జక్కన్న.

 

 

కాగా బెస్ట్‌ పిక్చర్‌, బెస్ట్‌ డైరెక్టర్‌ కేటగిరీల్లోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా హెచ్‌సీఏ అవార్డుల కోసం నామినేట్‌ అయ్యింది. కానీ వాటిలో నిరాశే ఎదురైంది. ఈ రెండు కేటగిరీల్లో ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ ది వన్స్‌ సినిమా అవార్డులు గెలుచుకోవడం గమనార్హం. ఇలా ప్రపంచవ్యాప్తంగా అవార్డుల్లో సత్తా చాటుతున్న ఈ సినిమాకు ఆస్కార్‌ కూడా ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్‌. ఈ మేరకు సోషల్‌మీడియాలో సందడి చేస్తున్నారు.