Stalin and family pretending to be Tamil: Telangana Governor Tamilisai
mictv telugu

అగ్నిపర్వతం.. హిమాలయాలను ఏమీ చేయలేదు.. తమిళిసై సీరియస్

November 7, 2022

తెలంగాణలో గొప్పలు చెప్పేందుకు వీలుకాక, తమిళనాడును విమర్శిస్తున్నారంటూ తమిళిసైని ఉద్దేశించి డీఎంకే అధికార పత్రిక ‘మురసోలి’ లో ప్రచురితమైన వ్యాసంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రస్థాయిలో స్పందించారు. తెలుగు మూలాలు ఉండి, ఇంట్లో ఆ భాష మాట్లాడుతూ బయట తమిళవేషం వేసేవారు, తనలా నిజమైన తమిళ రక్తం ప్రవహించే వారి వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీఎంకే తనను అగ్నిపర్వతం అని చెప్పుకుంటోంది. కానీ అది హిమాలయాలను ఏమీ చేయలేదు. ఏం చూసినా భయపడే వాళ్ళే.. గవర్నర్లను విమర్శిస్తున్నారు. సీరియళ్లు, సినిమాల్లో నటించి పదవిలోకి వచ్చిన వారికే కెమెరా, మైక్ మేనియాలు ఉంటాయి. నిజాలు మాట్లాడే మాకు ఉండవు. వారికి మైక్ మేనియా అనే అంటే మోదీ ఫోబియా ఎక్కువగా ఉంది’ అని విమర్శించారు.

తనను విమర్శించడానికి ముందు తెలంగాణ పత్రికల్లో వచ్చే వార్తలు చూస్తే ఎవరు వణుకుతున్నారో అర్థమవుతుందని అన్నారు. తమిళనాడులో వారసత్వ రాజకీయ ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలదీస్తున్నందునే గవర్నర్ రవిపై అధికార పార్టీ నేతలకు కోపమని తమిళిసై పేర్కొన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలలో పని చేస్తూ మార్గమధ్యలో ఒకటి, రెండు కార్యక్రమాల్లో పాల్గొనే తనను విమర్శించే పని పెట్టుకోవద్దని తమిళిసై హితవు పలికారు.