సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ జాతీయ పార్టీ భారీ బహిరంగ సభ ఖమ్మంలో సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. తొలి బహిరంగ సభతో దుమ్ములేపిన బీఆర్ఎస్ .. రెండో సభకు సిద్ధమవుతున్నది. ఫిబ్రవరి 17న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఖమ్మం సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు హాజరవగా.. ఈ సారి సభకు తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు ఎంకే స్టాలిన్, హేమంత్ సొరేన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్ రానున్నారు. వచ్చే నెల 17న ఉదయం 11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య తెలంగాణ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితరులు అతిథులుగా హాజరవుతారు.
ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే సభకు వారంతా రానున్నారు. ఇక ఈ సభకు బీహార్ సీఎం నితీశ్‌కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ తదితర ముఖ్య నేతలు, వివిధ సంఘాలు, వర్గాల ప్రతినిధులు వస్తున్నారు. సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత జరిగే సభలో వీరంతా పాల్గొంటారు.
ఇప్పటికే కేరళ సీఎం పినరాయి విజయన్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి బీఆర్ఎస్కు మద్ధతుగానే ఉన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా బీఆర్ఎస్ రెండో సభకు హాజరుకానుండడంతో దాదాపు దక్షిణాదిలోని రాష్ర్టాలన్నింటిలో బీఆర్ఎస్కు బలం ఉన్నట్లే. ఇక ఖమ్మం సభకు ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్తోపాటు ఉత్తరాది కీలక నేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్ కూడా వచ్చి వెళ్లారు. ఇప్పుడు హైదరాబాద్ సభకు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్, బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ రానున్నారు.నార్త్ లో కూడా బీఆర్ఎస్ కు మద్ధతు లభించినట్లే. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో త్వరలోనే భారీ బహిరంగ సభలు నిర్వహించేలా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.