అతి నిర్ణయాల ముగింపు ఎప్పుడూ విషాదమే. ఇది తెలియని కొందరు తాము చూసింది, విన్నదే నిజం అనుకుని అతి చర్యలకు పాల్పడి ఎదుటివారి జీవితాలను నాశనం చేసిందే కాక తమ జీవితాలను కూడా బుగ్గిపాలు చేసుకుంటారు. ఈమధ్య సినిమాల్లోలా కంటికి నచ్చిన అమ్మాయిని ప్రేమించడం.. తర్వాత ఆమె మీద తమ ప్రేమను బలవంతంగా రుద్దుతారు. ఆమె ఒప్పుకోకపోతే దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. విజయవాడ యువతి సజీవ దహనం ఘటనలో జరిగింది అదే. విజయవాడ హనుమాన్ పేటలోని ఓ ప్రైవేటు పార్శిల్ కార్యాలయంలో యువతిపై ఉన్మాది నాగభూషణం పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఘటనా స్థలంలోనే మంటల్లో యువతి సజీవ దహనమయ్యింది. ఆ మంటలు యువకుడికి అంటుకుని తీవ్రగాయాలు అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు కూడా కొద్దిసేపటి క్రితం మృతిచెందాడు.
కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన మృతురాలు(24) విజయవాడలోని ఓ ప్రైవేటు కోవిడ్ సెంటర్లో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. తనతో పాటు కలిసి పనిచేసే యువతులతో కలిసి ఆసుపత్రికి సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటోంది. అయితే కొన్ని రోజులుగా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురానికి చెందిన నాగభూషణం ఆమె వెంట ప్రేమించమని వేధిస్తున్నాడు. రోజురోజుకు అతని వేధింపులు ఎక్కువ కావడంతో వారం రోజుల క్రితమే నాగభూషణం మీద మృతురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు పిలిచి హెచ్చరించడంతో.. ఇక నుంచి ఆమె వెంట పడనని లిఖిత పూర్వకంగా ఒప్పకోవడంతో యువతి తన ఫిర్యాదును వెనక్కి తీసుకుందట. ఈలోపే అతడు ఉన్మాదిలా మారాడు. సోమవారం కొవిడ్ కేర్ సెంటర్లో విధులు ముగించుకుని రాత్రి 9 గంటల సమయంలో బాధిత యువతి తన గదికి బయలు దేరింది. ఈ క్రమంలో దారిలో పథకం ప్రకారమే ఉన్న నాగభూషణం ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఆమె మాట్లాడటానికి తిరస్కరించింది. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆమె మీద పెట్రోల్ పోసి తగలబెట్టి ఆమె ప్రాణాలు బలిగొన్నాడు. నిందితుడికి కూడా మంటలు అంటుకోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.