Star Producers Allu Aravind Suresh Babu Praises Samantha In Balakrishna Show
mictv telugu

బాలయ్య షోలో సమంత ప్రస్తావన.. దిగ్గజ నిర్మాతల షాకింగ్ కామెంట్స్

December 4, 2022

బాలకృష్ణ సంచలన టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ NBK 2’లో సమంతపై ప్రశంసలు కురిసాయి. అది కూడా ఇండస్ట్రీలోని ఇద్దరు దిగ్గజ తెలుగు నిర్మాతల నుండి కావటం విశేషం. టాలీవుడ్ ని ఏలుతున్న ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, సురేష్ బాబులు సమంతనే భవిష్యత్తు మహానటి అంటూ అనూహ్య ప్రశంసలు ఇచ్చారు. ‘ఏ మాయ చేసావే’తో తన నటన జీవితాన్ని ప్రారంభించిన సమంత దక్షిణ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తరువాత నాగ చైతన్యను పెళ్ళాడి.. విడాకులు సైతం తీసుకుంది. దాంతో సర్వత్రా విమర్శలపాలైంది సమంత. పరిశ్రమ, మీడియా, సోషల్ మీడియాలో ఇలా ఎక్కడ చూసినా సమంతపై ఒకటే ట్రోలింగ్. ఇక అక్కడితో సమంత కెరీర్ క్లోజ్ అనుకున్నారంతా. కానీ ఇక్కడే సమంత గేర్ మార్చేసింది. ఊహించని విధంగా వరుస హిట్స్ కొట్టేసింది. అనతికాలంలోనే పాన్ ఇండియా హీరోయిన్ కూడా అయిపోయింది సమంత.

ప్రస్తుతం తన సుదీర్ఘ కెరీర్ లోనే ఉచ్చ స్థితిలో ఉన్న సమంత ప్రస్తావన తాజాగా బాలకృష్ణ షోలో ఎదురైంది. అల్లు అరవింద్, సురేష్ బాబులు ‘అన్‌స్టాపబుల్ విత్ NBK 2’ షోకి గెస్టులుగా వచ్చారు. ఈ షోలో బాలయ్య మాట్లాడుతూ.. టాలీవుడ్ లో తర్వాతి మహానటి ఎవరు? అని అడిగారు. దాంతో నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ ఇద్దరు తడుముకోకుండా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘తదుపరి మహానటి’ అయ్యే సత్తా ఉన్న ఏకైక నటి సమంత అని వెల్లడించారు. ఆమె నటన చాలా నేచేరల్ గా అద్భుతంగా ఉంటుందని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై సమంత కూడా స్పందించారు. ఇద్దరు లెజండరీ నిర్మాతల నుండి ప్రశంసలు దక్కటం అదృష్టమని చెప్పింది. ఇక అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమకి మహానటిగా వెలుగొందిన సావిత్రి లానే సమంత కూడా ఇండస్ట్రీ నంబర్ వన్ అవుతుందని సమంత అభిమానులు ప్రశంసిస్తున్నారు.