దేశ స్టార్ రెజ్లర్లు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, జాతీయ కోచ్‌లకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. వారి వేధింపులు ఎక్కువయ్యాయని, వారిని తొలగించేవరకు ఏ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనబోమని తేల్చి చెప్పారు. ‘వారి వేధింపులకు ఓ సారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. మహిళా రెజ్లర్లను వారిద్దరూ లైంగికంగా వేధించారు. నన్ను ఎందుకూ పనికిరావని తిట్టడంతో మానసిక క్షోభకు గురయ్యా. మా గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు.
గతంలో ఫిర్యాదు చేసినందుకు నన్ను చంపుతామని బెదిరించారు’ అని స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కంట నీరు పెట్టుకున్నారు. ఇంకో స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ‘సమాఖ్యలో ఉన్నవారికి ఆట గురించి ఏమాత్రం తెలియదు. మమ్మల్ని తిట్టడం, కొట్టడం చేసేవారు. చాలా వేధింపులకు గురి చేశారు. మా పోరాటం రెజ్లింగ్ ఫెడరేషన్ పైనే కానీ ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీపై కాదు’ అంటూ అభిప్రాయపడ్డారు.
ఈ ధర్నాలో పూనియా, పొగాట్లతో పాటు సంగీతా ఫొగాట్, సరితా మోర్, సాక్షి మాలిక్, సుమిత్ మాలిక్ సహా 30 మంది పేరున్న రెజ్లర్లు పాల్గొన్నారు. కాగా, ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్ 2011 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈయన యూపీ కైసర్ గంజ్ నుంచి ఎంపీగా గెలిచిన బీజేపీ నాయకుడు.