ఏ మొఖం పెట్టుకొని హైదరాబాద్ వస్తున్నరు?.. ప్రధానిపై కేటీఆర్ ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏ మొఖం పెట్టుకొని హైదరాబాద్ వస్తున్నరు?.. ప్రధానిపై కేటీఆర్ ఫైర్

June 21, 2022

ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు హైదరాబాద్‌కు ఎందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌ నగర పరిధిలోని కైతలాపూర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన‌ సభలో మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఏం సాయం చేశారు? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని హైదరాబాద్ వస్తున్నారని నిలదీశారు. వేల కోట్లతో అభివృద్ధి పనులు అంటూ ప్రకటనలు చేస్తారే తప్ప, అందులో వాస్తవం ఉండదని విమర్శించారు.

2014లో జన్ ధన్ ఖాతాలు తెరవాలని చెప్పారని, రూ.15 లక్షలు వేస్తానని చెప్పి, ఒక్కరి ఖాతాలో అయినా రూ.15 లక్షలు పడ్డాయా? అని ప్రశ్నించారు. 2022 కల్లా భారతదేశంలోని ఇంటింటికీ నల్లాపెట్టి నీరు అందిస్తానని చెప్పిన మోదీ ఆ సంగతి ఏమైందని నిలదీశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మిషన్‌ భగీరథ కార్యక్రమానికి ఒకపైసా కూడా సాయం చేయలేదని ఆరోపించారు. నీతి ఆయోగ్‌ స్వయంగా రూ.19వేలకోట్ల సాయం చేయమని చెప్పినా 19 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. గతేడాది అక్టోబర్‌లో వరదలు వస్తే.. పేదలకు రూ.10 వేల కోట్ల మేర సాయం చేశామని కేటీఆర్ చెప్పారు. మోదీని సాయం అడిగితే ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదని అన్నారు. అదే, గుజరాత్ లో వరదలు రాగానే హుటాహుటీన వెళ్లి రూ.1000 కోట్లు ఇచ్చాడని ఆరోపించారు. దేశంలో మతపిచ్చి లేపారని, అగ్నిపథ్ అనే పథకం తీసుకువచ్చి దేశ యువత పొట్టకొడుతున్నారని విమర్శించారు. వాళ్లు నిరసనలు తెలుపుతుంటే, వాళ్లను దేశద్రోహులంటున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.