ట్రంప్‌కు తెలంగాణలో మరో భక్త్.. సూదిలో ఇరికించాడు..  - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్‌కు తెలంగాణలో మరో భక్త్.. సూదిలో ఇరికించాడు.. 

February 24, 2020

State Mattewada micro-artist Ajay Kumar re-creates ‘Donald Trump’ wax statue

జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్స కృష్ణ ట్రంప్‌ విగ్రహం పెట్టి గుడి కట్టగా.. ఇప్పుడు మరో తెలంగాణ వీరాభిమాని సూదిలో ట్రంప్ విగ్రహాన్ని చెక్కారు. వరంగల్‌ జిల్లాకు చెందిన జాతీయ మైక్రో ఆర్టిస్ట్ మట్టెవాడ అజయ్‌ కుమార్‌ తన కళాభిమానాన్ని ట్రంప్‌పై ఇలా ప్రదర్శించడం పలువురిని ఆకట్టుకుంటోంది. ట్రంప్‌ సూక్ష్మశిల్పాన్ని కేవలం  1.00 మిల్లిమీటర్ల సూది రంధ్రంలో మైనంతో చెక్కారు.  స్వర్ణ కళాకారుడైన అజయ్ కుమార్ చిన్ననాటి నుంచి ఇటువంటి మైక్రో ఆర్ట్‌లు తయారు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. 

 

ఈ సూక్ష్మశిల్పం గురించి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘దీనిని తయారు చేసేందుకు నాకు 4 రోజుల 13 గంటల సమయం పట్టింది. గతంలో కూడా నేను  ప్రధాని మోదీ సూక్ష్మ శిల్పాలను సూది రంధ్రంలో చెక్కాను. దానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ప్రస్తుత ట్రంప్ సూక్ష్మ శిల్పం ఎత్తు 1.25 మి.మీ, వెడల్పు 0.32 మి.మీ ఉండగా.. అమెరికా జాతీయ జెండా ఎత్తు 0.94 మి.మీ, వెడల్పు 0.64 మి.మీ.లుగా చెక్కాను’ అని అజయ్ వివరించారు. 

అజయ్ ఇదే కాదు ఇలాంటివి ఇంకెన్నో రికార్డులను సైతం నెలకొల్పారు. తన సూక్ష్మ కళతో అనేక అవార్డులు, రివార్డులు పొందారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సూది బెజ్జంలో పట్టే ఏసుక్రీస్తు 0.9 మిల్లీ మీటర్ల విగ్రహాన్ని చెక్కారు. ఏసు తలపై ముళ్లకిరీటం.. చేతులకు, కాళ్లకు మేకులు కొట్టినట్లుగా.. ఆ గాయాల నుంచి రక్తం కారినట్లుగా విగ్రహాన్ని చెక్కారు. వినాయక చవితి సందర్భంగా అజయ్ గణపతి సూక్ష్మ విగ్రహాలను చెక్కి ప్రశంసలు అందుకున్నారు. 2019 అక్టోబర్‌లో అజయ్ కుమార్ తొలిసారిగా ఏసీజీ వరల్డ్‌ గ్రూప్‌ వారు నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఆర్ట్‌ ఇన్‌ క్యాప్సుల్‌ కాంపిటీషన్‌లో మొదటి బహుమతి( 5 వేల డాలర్‌ ప్రైజ్‌మనీ) గెలుపొందారు. ఈ కాంపిటీషన్‌లో ఇండియా, అమెరికా, లాటిన్‌ అమెరికా, యూరప్‌ దేశాల నుంచి 80 మంది సూక్ష్మ కళాకారులు పాల్గొనగా.. వాళ్లందరినీ వెనక్కి నెట్టి అజయ్ ప్రథమ బహుమతి పొందడం విశేషం.