ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతలతో పాటు సొంత పార్టీ నుంచి ఆయన విమర్శలు ఎదుర్కోవల్సి వస్తోంది. రాష్ట్ర మహిళా కమిషన్ కూడా బండి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన కమిషన్.. ఈనెల 15న ఉదయం 11 గం.కు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని డీజీపీని గతంలోనే కమిషన్ ఆదేశించింది. అయితే తాజాగా బండి సంజయ్‌కి వ్యక్తిగతంగా మహిళా కమిషన్ నోటీసులు పంపింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత ఈడీ విచారణపై మాట్లాడుతున్న సమయంలో బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కవితను అరెస్ట్ చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ “తప్పుచేసినోళ్లను అరెస్ట్ చేయకుండా.. ముద్దు పెట్టుకుంటారా” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. బండి సంజయ్ దిష్టిబొమ్మలను దగ్థం చేస్తూ బీజేపీ వ్యతిరేకంగా తీవ్ర నినాదాలు చేశారు. మరోవైపు సొంత పార్టీ ఎంపీ అర్వింద్ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని సూచించారు.