కృష్ణా నదిలో తెలంగాణ పరీవాహక ప్రాంతంలో సీతారామ లక్ష్మణ విగ్రహాలు కొట్టుకొచ్చాయి. విగ్రహాలతో పాటు పూజా సామాగ్రి, కుండలు కూడా ప్రవాహంలో వచ్చాయి. ఆత్మకూరు మండలం జూరాల ప్రాజెక్టు సమీపంలో ఈ విగ్రహాలు ఒడ్డుకు కొట్టుకురాగా, గమనించిన స్థానికులు అధికారులను సమాచారమిచ్చారు.
దేవతా మూర్తుల విగ్రహాలు నీటి ప్రవాహంలో ఒడ్డుకు వచ్చినా చెక్కు చెదరకపోవడం గమనార్హం. అయితే విచిత్రమేమిటంటే సీతారామ లక్ష్మణులతో పాటు విడిగా హనుమంతుని విగ్రహం కూడా కొట్టుకురావడం ఆశ్చర్యపరుస్తోంది. కాగా, విగ్రహాలకు ఆభరణాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విగ్రహాలను పురావస్తు శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలో విగ్రహాలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని వారు తెలిపారు.