చనిపోయేదాకా కాంగ్రెస్‌లోనే ఉంటా: వెంకట్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

చనిపోయేదాకా కాంగ్రెస్‌లోనే ఉంటా: వెంకట్ రెడ్డి

March 22, 2022

తెలంగాణలోని భువనగిరి ఎంపీ, మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బ్రదర్స్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీని వీడి, బీజేపీలో చేరుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢీల్లీలో రేవంత్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. సామాజిక మాధ్యమాలపై మండిపడ్డారు. అంతేకాకుండా ఊపిరి ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

”తుదిశ్వాస విడిచే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రులను కలిశాం. కానీ, సోషల్ మీడియా మాత్రం బీజేపీలో వెంకట్ రెడ్డి చేరుతున్నారని తప్పుడు వార్తలు రాశారు. నా సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభిప్రాయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ఒకే ఇంట్లోనే ఎన్నో గొడవలు ఉంటాయి. అలాంటిది కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉండటం సహజమే. బీజేపీ, టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ కన్నా ఎక్కువ గొడవలున్నాయి” అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.

మరోపక్క ఇటీవలే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి త్వరలోనే పార్టీ మారడంపై స్పష్టత ఇస్తానని మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నా తమ్ముడి అభిప్రాయాలకి, తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడంతో ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నట్లు పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.