ఆడపిల్లలపై అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోంది. మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన మరువకముందే మరో దారుణం వెలుగుచూసింది. వావివరుసలు మరచి కామంతో కళ్ళు మూసుకుపోయి ఓ బాలికపై సవతి తండ్రి మూడేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండ్లగూడలోని గౌస్‌నగర్ ప్రాంతంలో జరిగింది.
ఇదే ప్రాంతానిక చెందిన ఒక మహిళకు కూతురు(14), ఇద్దరు కుమారులున్నారు. భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న ఆమె 2017లో అంబర్‌పేటకు చెందిన ఒక వ్యాపారి (45)ని పెళ్లి చేసుకుంది. అతనికి అప్పటికే వివాహం కాగా భార్యతో అంబర్‌పేటలో ఉంటున్నాడు. అప్పుడప్పుడు గౌస్‌నగర్‌లోని రెండో భార్య వద్దకు వచ్చి వెళ్తుండేవాడు.
ఇంట్లో తల్లి లేని సమయంలో మృగంగా మారి వావి వరుసలు మరచి కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గత మూడు సంవత్సరాల నుండి ఈవిధంగా కుమార్తెను తల్లి లేని సమయంలో లోబర్చుకుంటూనే ఉన్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో లోకం తెలియని చిన్నారి ఎవరికి చెప్పకుండా తనలో తానే కుమిలిపోయేది.
ఈనెల 13వ తేదీన తల్లి లేని సమయంలో బాలికను భయపెట్టి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆకస్మాత్తుగా ఇంటికొచ్చిన మహిళ ఆ దుశ్చర్యను చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.