స్టీఫెన్ హాకింగ్‌కు నోబెల్ ప్రైజ్ ఎందుకు రాలేదు? - MicTv.in - Telugu News
mictv telugu

స్టీఫెన్ హాకింగ్‌కు నోబెల్ ప్రైజ్ ఎందుకు రాలేదు?

March 14, 2018

ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ప్రతిపాదించిన సిద్ధాంతాల్లో చాలావరకు అందరి ఆమోదం పొందాయి. సర్వస్వాన్ని జీర్ణించుకునే కృష్ణబిలాలు(బ్లాక్ హోల్స్)కు మరణం లేదన్న ఆయన సిద్ధాంతంతో శాస్త్రవేత్తలు ఏకీభవిస్తున్నారు. వీటితోపాటు విశ్వరం, గ్రహాంతర జీవం తదితరాలపై హాకింగ్ చేసిన పరిశోధనలు, సూత్రీకరణలు సంచలనం సృష్టించాయి. అయితే ఇంత గొప్ప శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఎందుకు రాలేదు?

ఎందుకంటే.. కృష్ణబిలాలు అజరామరం అన్న ఆయన వాదనను ఇంతవరుకు శాస్త్రీయంగా రుజువు చేయలేదు కనుక. రుజువు చేసే అవకాశం కూడా సమీప భవిష్యత్తులో లేదు కనుక. ‘హాకింగ్ భావనను నిరూపించే అవకాశం, మార్గం మనకు లేవు. వాటిని జీవన్మరణ చక్రాలు సుదీర్ఘమైనని. ప్రస్తుత టెక్నాలజీ సాయంతో వాటిని చావుపుట్టుకలను అంచనా వేయడం కష్టం’ అని సైంటిఫిక్ అంశాల రచయిత తిమోతీ ఫెర్రిస్. నేషనల్ జాగ్రఫిక్ పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

కృష్ణబిలాలు నాశనం కావడాన్ని పరిశీలించగలం అనే భావనను హాకింగ్ ప్రతిపాదించి ఉంటే నోబెల్ వచ్చేదని, అయితే వందల వేలకోట్ల ఏళ్లు పట్టే ఆ ప్రక్రియను పరిశీలించడం అంత సులువు కాదని కూడా అన్నారు. కాగా, 1964లో హిగ్స్ బోసన్ (దైవకణం) సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన పీటర్ హిగ్స్ కు కూడా నోబెల్ బహుమతి రాకపోవడానికి ఇదే కారణం అని ఫెర్రిస్ పేర్కొన్నారు. అయితే ఆధునిక టెక్నాలజీ సాయంతో 2013లో ఆయన ఫ్రాంకోయిస్ ఇంగ్లెర్ట్‌తో కలిసి చేసిన పరిశోధన ఫలించడంతో నోబెల్ బహుమతి వచ్చిందన్నారు.