ప్రపంచాన్ని మరోసారి కరోనా భయపెడుతోంది. ప్రధానంగా చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కోట్ల మంది కరోనా బారిన పడుతున్నారు. మరణాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఇతర దేశాలలోనూ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. భారత్‌లోనూ కొత్త వేరియంట్(BF-7 కేసులు నాలుగు నమోదయ్యాయి. సాధరణ కరోనా కేసుల సంఖ్య కూడా పెరిగింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వైద్య నిపుణులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. జాగ్రతల్లు పాటించాలని చెప్తున్నారు. అదే విధంగా కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారు బూస్టర్ డోస్ కూడా వేసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్న సమయంలో బూస్టర్ డోస్ తీసుకోవాలంటున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. గతంలోనే అనంతరం బూస్టర్ డోస్ తీసుకోవాలంటూ నిపుణులు సూచించినప్పటికీ ప్రజల నుంచి పెద్దగా ఆసక్తి చూపలేదు. కరోనా మూడో వేవ్ ఒమిక్రాన్ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ప్రజలు రెండు డోసులు తీసుకుని ఉండిపోయారు.
బూస్టర్ డోస్కోస్ తీసుకునేందుకు కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. కరోనా రెండో డోస్ తీసుకుని 9 నెలలు అయ్యాక బూస్టర్ డోస్‌ను వేసుకోవచ్చు. దీనికోసం గతంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ ఆధారంగా లాగిన్ అయితే సరిపోతుంది. పిన్ కోడ్ నమోదు చేస్తే సమీపంలోని టీకా కేంద్రాల వివరాలు కనిపిస్తాయి. అందులో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో డబ్బులు చెల్లిస్తే నాసల్ టీకాను ఇస్తున్నారు. త్వరలో ఉచితంగా బూస్టర్ డోస్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది.