ధన త్రయోదశికి బంగారం, వెండే కాదు ‘ఇనుమూ’ కొనండి(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ధన త్రయోదశికి బంగారం, వెండే కాదు ‘ఇనుమూ’ కొనండి(వీడియో)

October 20, 2019

ధన త్రయోదశి నాడు తమ జీవితాల్లోకి సిరి సంపదలు సమృద్ధిగా రావాలంటూ ఇష్ట దేవతలను భక్తులు ఆరాధిస్తారు. కొత్త వస్తువులు, బంగారం, వెండి వంటి వాటిని కొనుగోలు చేస్తే వారికి మంచి జరుగుతుందని చాలామంది విశ్వసిస్తారు. ఇంత విశిష్ఠత కలిగిన ఈ పర్వదినం ఈసారి దీపావళి పండుగకు ఒక్క రోజు ముందు వస్తోంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని కొందరు యువతులు సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు. అందుకు పాటే ప్రామాణికంగా భావించారు. ఈ క్రమంలో ఓ పాటను రూపొందించారు. 

ఈ వీడియోలో ఆనందంతో సహా ఆరోగ్యం కూడా కావాలనే సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యంగా మన దేశంలో ఎంతో మంది మహిళలు, బాలికలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఐరన్‌ లోపం. దీని వల్ల ప్రతి ఇద్దరిలో ఒక మహిళ ఎనీమియా వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ధన త్రయోదశి నాడు బంగారం, విలువైన వస్తువులను కొనుగోలు చేయకుండా.. ఆ డబ్బును ఐరన్ ఉండే పదార్థాలు కొనేందుకు వినియోగించాలని ఆ యువతులు వీడియోలో చక్కగా చెప్పారు. మనం ఆరోగ్యంగా వుంటే ఏవైనా అవే వస్తాయి అని చెప్పకనే చెప్పారు. ఐరన్‌ లోపం తలెత్తకుండా ఉండేందుకు అది సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలంటూ మహిళల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. ఈ వీడియో చూసి చాలా మంది లైక్, కామెంట్లు, షేర్లు చేస్తున్నారు.