దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోయాయి. అమ్మకాలు జోరుగా సాగడంతో సెన్సెక్స్ 785 పాయింట్లు, నిఫ్టీ 235 పాయింట్లు కోల్పోయాయి. దీంతో సెన్సెక్స్ 60 వేల దిగవకు పడిపోగా, నిఫ్టీ 17,600 వద్ద స్థిరపడింది. పోయిన సంపద మొత్తం విలువ రూ. 3 లక్షల కోట్లుగా ఉంది. బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం 265.21 లక్షల కోట్ల నుంచి రూ. 262.41 లక్షల కోట్లకు పడిపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా నష్టోపోయి 82.85 వద్ద ఉంది. అటు అదానీపై హిండెన్ బర్గ్ ప్రభావం గట్టిగానే చూపింది.
జనవరి 24 నుంచి ప్రారంభమైన అమ్మకాల సెంటిమెంటుతో అదానీ గ్రూప్ స్టాక్‌లు 11 లక్షల 43 వేల 702 కోట్ల నష్టాలను చవిచూసింది. మంగళవారం ఒక్కరోజే అదానీ కంపెనీల మార్కెట్ విలువ రూ. 8 లక్షల 7 వేల 794 కోట్ల నుంచి రూ. 7 లక్షల 74 వేల 356 కోట్లకు పడిపోయింది. దీంతో మార్కెట్ వ్యాల్యూపరంగా అదానీ నాలుగో స్థానంలో నిలిచినట్టైంది. మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, రెండో స్థానంలో టీసీఎస్, మూడో స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎం క్యాప్ ఉన్నాయి.