stokes well played in world cups
mictv telugu

అప్పుడు జీరో..ఇప్పుడు హీరో..

November 13, 2022

అది 2016 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య హోరాహోరిగా సాగుతోంది. చివరకు ఆరు ఓవర్లలో వెస్టిండీస్ 19 పరుగులు చేయాలి.అప్పటికే ఇంగ్లాండ్ అభిమానులు మ్యాచ్ గెలవకపోయినా..గెలిచేస్తాం అనే ఆనందంలో ఉన్నారు. ఇంతలో స్టోక్స్ బాల్ అందుకున్నాడు. అటు స్ట్రైక్ లో వెస్టిండీస్ హిట్టర్ బ్రాత్ వైట్ క్రీజ్‌లో ఉన్నాడు. స్టోక్స్ వేసిన మొదటి బాల్ సిక్స్, రెండో బాల్స్ సిక్స్ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మూడు, నాలుగు బంతులు కూడా స్టేడియంలోకే పోయాయి. అంతవరకు ఆనందంగా ఉన్న ఇంగ్లాండ్ అభిమానులు ఒక్కసారిగా కుంగిపోయారు. వెస్డిండీస్ ఆటగాళ్ల విజయ గర్జనలు, ఆనందోత్సవాలు చూసి ఇంగ్లాండ్ ఆటగాళ్లు మిన్నకుండిపోయారు. చేతిలోకి వచ్చిన వరల్డ్ కప్‌ను అందకుండా చేసిన స్టోక్స్‌ను విలన్‌లా చూసారు. యావత్ ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులు అతనిని దుమ్మెత్తి పోసారు. ఈ సమయంలో స్టోక్స్ తీవ్ర విమర్శలు ఎదుర్కోని జీరోగా మిగిలిపోయాడు.

కట్ చేస్తే 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్‌తో లార్డ్స్ వేదికగా ఉత్కంఠగా సాగింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేయగా.. ఛేదనలో ఆఖరి బంతి వరకూ పోరాడిన ఇంగ్లాండ్ టీమ్ సరిగ్గా 50 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌటైంది. తర్వాత సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ కూడా వికెట్ నష్టానికి సరిగ్గా 15 పరుగులే చేయడంతో మ్యాచ్‌ మళ్లీ టై అయ్యింది. దీంతో.. మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు బాదిన ఇంగ్లాండ్ టీమ్‌ని విజేతగా ప్రకటించారు. ప్రపంచకప్‌లో నాలుగోసారి ఫైనల్‌కి చేరిన ఇంగ్లాండ్ టీమ్‌ ఎట్టకేలకి తొలి కప్‌ని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఆ మ్యాచ్‌లో స్టోక్స్ అద్భతంగా ఆడాడు. బట్లర్ అర్థసెంచరీతో తప్ప మిగిలిన వాళ్లు విఫలమైన చోట జట్టుకు విజయాన్ని అందించాడు. 98 బంతుల్లో 84 పరుగులు చేసి అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్‌ను దేశానికి అందించాడు. దీంతో ఒక్కసారిగా స్టోక్స్ హీరో అయిపోయాడు. 2016 టీ 20 ఫైనల్ మ్యాచ్‌ను మరిచిపోయిన ఇంగ్లాండ్ వాసులు స్టోక్స్ పై ప్రశంసలు కురిపించారు. పొగడ్తలతో ముంచెత్తించారు.

ఇప్పుడు టీ 20-2022 వరల్డ్ కప్ ఫైనల్లోనూ స్టోక్స్ అధ్భుతంగా ఆడాడు. అత్యవసరమైన ఇన్నింగ్స్‌ తో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 52 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఒకప్పుడు జీరో అయిన స్టోక్స్ అంచెలంచెలుగా ఎదిగి ఇంగ్లాండ్ ప్రపంచ్ కప్స్ హీరోగా మారిపోయాడు.