Stone attack on JC Ashmit Reddy.. Tension in Tadipatri
mictv telugu

జేసీ అష్మిత్ రెడ్డిపై రాళ్లదాడి.. తాడిపత్రిలో ఉద్రిక్తత

November 24, 2022

అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు, స్థానిక టీడీపీ ఇంచార్జ్ అష్మిత్ రెడ్డిపై రాళ్లదాడి జరిగింది. మున్సిపాలిటీలో పర్యటిస్తున్న అష్మిత్ రెడ్డిపై పలువురు రాళ్లదాడికి దిగారు. ఈ దాడితో అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు కూడా రాళ్ల దాడి చేశారు. ఈ పరస్పర దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ సమయంలో అస్మిత్ రెడ్డి ఓ ఇంట్లోకి వెళ్లి ఉండిపోయారు. గాయపడ్డ కార్యకర్తలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 3వ వార్డులో పర్యటిస్తుండగా విద్యుత్ సరఫరా ఆగిపోయిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.అంతకుమందు తమ వార్డులో పర్యటించడానికి వీల్లేదని జేసీ అష్మిత్ రెడ్డిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

తమ పర్యటన ఇష్టం లేని స్థానిక వైసీపీ నేతలే తమపై రాళ్లదాడి చేశారని అష్మిత్ రెడ్డి ఆరోపించారు.స్థానిక వైసీపీ నాయకుడు, కౌన్సిలర్ కి చెందిన బీడీ పరిశ్రమ భవనం పై నుంచే రాళ్లు విసిరారని తెలిపారు. ఇది ప్లాన్ ప్రకారం చేయకపోతే అంతటా ఉన్న కరెంట్ సరఫరా కేవలం దాడి జరిగిన ప్రాంతంలోనే ఎలా నిలిచిపోయిందని ప్రశ్నించారు. తన కుమారుడు అష్మిత్ రెడ్డిపై రాళ్ల దాడి ఘటనపై సమాచారం అందుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేకే వైసీపీ నాయకులు ఇలా చాటుగా ఉండి రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అష్మిత్ రెడ్డి, టీడీపీ నేతలపై రాళ్లదాడిని పిరికిపందల చర్యగా జేసీ ప్రభాకర్ రెడ్డి అభివర్ణించారు.