రంజాన్​ వేళ ఇరువ‌ర్గాల కొట్లాట‌.. ఇంటర్నెట్ సేవ‌లు​ బంద్​ - MicTv.in - Telugu News
mictv telugu

రంజాన్​ వేళ ఇరువ‌ర్గాల కొట్లాట‌.. ఇంటర్నెట్ సేవ‌లు​ బంద్​

May 3, 2022

రంజాన్‌ పండగ వేళ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అల్లర్లు చెలరేగాయి. సోమ‌వారం రాత్రి రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని నిలిపివేశారు.

అస‌లేం జ‌రిగిందంటే..

పండుగ సంద‌ర్భంగా సోమ‌వారం సాయంత్రం జోధ్‌పూర్‌లోని జలోరీ గేట్‌ వద్ద జెండాలను ఏర్పాటు చేసే విషయంలో రెండు వ‌ర్గాలు గొడ‌వ ప‌డ్డాయి. అది కాస్త ముదిరి ఒక‌రిపై ఒక‌రు రాళ్లు విసురుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. ఆ స‌మయంలో పోలీసులపైకి కూడా ఆందోళనకారులు రాళ్లు విస‌ర‌డంతో వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంటర్నెట్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. పోలీసు బందోబస్తు నడుమ ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి కల్పించారు. ఈ ఘర్షణలపై రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ స్పందించారు. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు. శాంతి భద్రతలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.