త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వందే భారత్ రైలుపై బుధవారం విశాఖలో రాళ్ల దాడి జరిగింది. కంచరపాలెం సమీపంలో రామ్మూర్తి పంతులు గేటు వద్ద రైలుపై దాడి జరుగగా, బోగీ అద్దాలు ధ్వంసమయ్యాయి.
మెయింటెనెన్స్ సమయంలో ఈ దాడి జరిగిందని రైల్వే అధికారులు చెప్పగా, ఘటనపై విచారణ జరుపుతున్నామని రైల్వే పోలీసులు వెల్లడించారు. విశాఖ – సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ రైలు బుధవారమే విశాఖకు చేరుకుంది. నిర్వహణ, పర్యవేక్షణలో భాగంగా రైలును విశాఖకు తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. కాగా, రెండు నగరాల మధ్య నడిచే ఈ రైలు ఎనిమిదిన్నర గంటల్లో గమ్యాన్ని చేరుకుంటుంది. మధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగనుంది. ఈ రైలు ప్రారంభానికి ఈ నెల 19 న ప్రధాని మోదీ సికింద్రాబాద్ రానుండగా, అనూహ్యంగా పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది.