కరోనా వచ్చిందని రాళ్ల దాడి.. సంగారెడ్డిలో దారుణం - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా వచ్చిందని రాళ్ల దాడి.. సంగారెడ్డిలో దారుణం

March 27, 2020

Stone Throw on Auto Driver in Sangareddy 

కరోనా వైరస్ మనుషులనే కాదు.. మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. పక్కన ఉన్న వ్యక్తి, దగ్గినా, తుమ్మినా ప్రమాదమని భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా అనారోగ్యంతో కనిపించగానే.. అనుమానిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ మానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా ఉందనే అనుమానంతో స్థానికులు ఓ వ్యక్తిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

కర్ణాటకలోని ఉమ్నాబాద్‌కు చెందిన చంద్రకాంత్‌ ప్యాసింజర్‌ ఆటో నడుపుతూ రామచంద్రాపురం మండలం బండ్లగూడ సమీపంలోకి వచ్చాడు. అక్కడికి రాగానే తీవ్రమైన దగ్గు రావడంతో కొంత సేపటికి కింద పడిపోయాడు. అతని పరిస్థితి చూసి స్థానికులు కరోనా వచ్చిందనే అనుమానంతో రాళ్లతో దాడి చేశారు. వారి దాడిలో సొమ్మసిల్లిన అతన్ని పోలీసులు పటాన్ చెరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు గాంధీకి తీసుకెళ్లాలని చెప్పారు. కాగా వైరస్ ఉందనే అనుమానంతో ఇలా దాడులు చేయడం అమానవీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదైనా ఉంటే వెంటనే వైద్యసిబ్బందికి సమాచారం ఇవ్వాలే తప్ప దాడులు చేయకూడదని సూచించారు.