Stones attack between TRS and BJP activists in Bandi Sanjay padayatra
mictv telugu

బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత.. TRS, BJP కార్యకర్తల మధ్య రాళ్ల దాడి

August 15, 2022

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోకి పాదయాత్ర ప్రవేశించడంతో స్థానిక బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆ పార్టీకి చెందిన యువకులు బాణసంచా కాలుస్తూ సంజయ్‌ను మండలంలోకి ఆహ్వానించారు. అనంతరం దేవరుప్పలలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్‌.. ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. ఎవరికీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు.. ముందు మోదీ ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలని నిలదీశారు.

దీంతో ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో కొంతమందికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ పరిణామాలపై బండి సంజయ్ సీరియస్ అయ్యారు. డీజీపీ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసిన ఆయన.. సీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడి చేస్తారని తెలిసినా సీపీ పట్టించుకోలేదన్నారు.