మీ నాటకాలు, మోసాలు ఆపండి: రేవంత్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

మీ నాటకాలు, మోసాలు ఆపండి: రేవంత్ రెడ్డి

April 11, 2022

 revanth

తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే ఒకవైపు నుంచి టీఆర్ఎస్ పార్టీ దీక్ష చేపట్టింది. ఇంకోవైపు తెలంగాణలోనే కాదు, పంజాబ్‌లో కూడా ఒక్క గింజను కొనము, కొనలేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, మీ నాటకాలు, మీ మోసాలు ఇక ఆపండి అంటూ పీసీసీ రేవంత్ రెడ్డి బీజేపీ, టీఆర్ఎస్‌ పార్టీలపై మండిపడ్డారు. మీరు చేస్తున్న డ్రామాలను తెలంగాణ ప్రజలు నిత్యం గమనిస్తూనే ఉన్నారు అని అన్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 అక్టోబరు 4న కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా?, రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు ఉరితాళ్లు బిగిస్తూ కేంద్రానికి లేఖ రాసే అధికారం మీకు ఎవరిచ్చారు? అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ఆయన మాట్లాడుతూ..”కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం విషయంలో రాజకీయాలు చేస్తున్నాయి. యాసంగి సీజన్‌లో ముందస్తుగా చేతికి వచ్చే ధాన్యం రా రైస్ కిందికే వస్తుంది. అలా వచ్చే ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడం దురదృష్టకరం. ధర్నాలు, నిరసనలు, నాటకాలు అంటూ ఆడుతున్న మీ ఆటలను ఆపండి.

రైతులు మీ రెండు పార్టీల మోసాలను గ్రహిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిపై రైతులకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్ల కారణంగా రూ.7500 కోట్లు నష్టం వచ్చినట్లు చెప్పి, ఇకపై కొనుగోలు కేంద్రాలు ఉండవని గత ఏడాది ఫిబ్రవరిలో ప్రకటన చేయలేదా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాల కారణంగా ఇప్పటికీ రైతులు దళారుల చేతుల్లో నష్టపోతున్న విషయం నిజం కాదా? ప్రభుత్వం చేతులెత్తేయడంతో నిస్సహాయ స్థితిలో రైతులు తక్కువ ధరకే ధాన్యాన్ని మిల్లర్లకు అమ్ముకుంటున్నారు” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.