ఏపీలో అపరిచితుడు.. ఫోన్‌లోనే గుండు కొట్టిస్తాడు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో అపరిచితుడు.. ఫోన్‌లోనే గుండు కొట్టిస్తాడు

October 23, 2020

ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్లకు కుంభీపాకం రుచి చూపిస్తూ టార్చర్ పెడతాడు అపరిచితుడు. అలాగే లంచాలు తీసుకునేవారిని అంతమొందించడంలో భారతీయుడు వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే ఓ యువకుడు ఈ సినిమాలను బాగా ఫాలో అయినట్టున్నాడు. ఈ యువకుడు మాత్రం ఎదుటివారిలో అన్యాయం, అధర్మం గురించి పట్టించుకోడు. ఎవరైనా తల మీద ఆడవాళ్లలా జుట్టు పెద్దగా పెంచారో అతనికి మండిపోతుంది. అంతే వారి ఫోన్ నంబర్ కనుక్కుని ఫోన్లు చేసి జుట్టు కత్తిరించుకోవాలని హుకుం జారీచేస్తాడు. అయినా ఎవడో కోన్ కిస్కాగాడు ఫోన్ చేస్తే జుట్టు కత్తిరించుకుంటారా ఎవరైనా? అని అనుకునేవారికి మనోడి దగ్గర ఓ ప్లాన్ ఉంది. తానో పోలీసునని, ఆడవాళ్లలా జుట్టు పెద్దగా పెంచుకుంటే కేసు పెడతానని చెబుతాడు. అతని హుంకరింపులు నిజమేనని నమ్మిన కొందరు ఎందుకొచ్చిన గొడవా అని జుట్టును కత్తిరించుకున్నారు. సంగారెడ్డికి చెందిన మచుకూరి పండారి అనే వ్యక్తి, తాను సీఐని అంటూ జుట్టు పెద్దగా ఉన్నవారికి ఫోన్ చేయసాగాడు. అనకాపల్లి భీముని గుమ్మం ప్రాంతానికి చెందిన మణికుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి జుట్టు కత్తిరించుకోవాలని బెదిరించాడు. 

దీంతో బెదిరిపోయిన మణికుమార్ జుట్టును కత్తిరించుకున్నాడు. పండారి అంతటితో ఆగకుండా గుండు చేయించుకోవాలని ఆదేశించాడు. లేకపోతే సైబర్ క్రైమ్ నేరంపై కేసు నమోదు చేస్తానని మణికుమార్‌ను వేధించాడు. మణికుమార్ గుండు గీసుకుని నిందితుడికి ఫొటో పంపగా.. ఫోటోలో అతని పక్కనే ఉన్న అన్నను కూడా జుట్టు కత్తిరించుకోమని బెదిరించాడు. దీంతో అనుమానం వచ్చిన మణికుమార్ బంధువులు అనకాపల్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పండారిని అరెస్ట్ చేసి  విచారించారు. విచారణలో పండారి పలు షాకింగ్ విషయాలు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. అతడు ఆంధ్ర, తెలంగాణలో పలువురు యువకులను బెదిరించి జుట్టు కత్తిరించుకునేలా చేశాడని వెల్లడించారు. సోషల్ మీడియాలో ప్రొఫైల్ ఫోటోల్లో తలపై జుట్టు ఎక్కువగా ఎవరికి ఉంటే వారి ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి బెదిరించడం నిందితుడికి అలవాటని అన్నారు. గతంలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. కాగా, పోలీసుల పేరు చెప్పి ఎవరైనా ఫేక్ కాల్ చేసి బెదిరిస్తే ఎవరూ భయపడవద్దని పోలీసులు పేర్కొన్నారు.