నేడే ఆకాశంలో అద్భుత దృశ్యం.. భూమికి దగ్గరగా పూర్ణచంద్రుడు - MicTv.in - Telugu News
mictv telugu

నేడే ఆకాశంలో అద్భుత దృశ్యం.. భూమికి దగ్గరగా పూర్ణచంద్రుడు

June 14, 2022

 

తెలుగు రాష్ట్రాల రైతులు.. ఈ ఏడాది చేయబోయే వ్యవసాయ పనులకు నేడు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ రోజు ఏరువాక పౌర్ణమి అని.. దుక్కి దున్నడం, ఇతరత్రా పనులు ఈ రోజు మొదలుపెడితే మంచి జరుగుతుందని వారి విశ్వాసం. ఈరోజుకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఆకాశంలో చంద్రుడు సూపర్‌మూన్‌లా కనిపించనున్నాడు. సాధారణ పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడి కన్నా ఇవాళ కనిపించే చంద్రుడు 10 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అలాగే, సాధారణ పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడి కన్నా పెద్దదిగా కనిపిస్తాడు. దీన్నే ‘స్ట్రాబెర్రీ మూన్'(అమెరికన్ మూలవాసులైన అక్కడి గిరిజన తెగల వారు పెట్టిన పేరు) అని కూడా పిలుస్తారు. చంద్రుడు భూమికి మరింత దగ్గరగా రావడం వల్లే ఇలా జరుగుతుంది.

సాధారణ రోజుల్లో కన్నా ఈరోజు చంద్రుడు మరో 16 వేల మైళ్ల మేర భూమికి దగ్గరగా వస్తాడు. దీన్నే ‘పెరిజీ’ అని పిలుస్తారు. ఇంత దగ్గరగా వచ్చినప్పుడు చంద్రుడు మరింత ప్రకాశవంతంగా, పెద్ద సైజులో కనిపిస్తాడు. సాధారణ పౌర్ణమి రోజుల్లో కనిపించే పరిమాణంతో పోలిస్తే ఫుల్ మూన్ రోజు కనిపించే చంద్రుడి ఆకారం మరింత పెద్దగా ఉంటుంది. మంగళవారం, బుధవారాల్లో సాయంత్రం నుంచి పూర్ణచంద్రుడు దర్శనం ఇవ్వనున్నాడు. భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 5.22 గం. సమయంలో ఆకాశంలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుంది.