పాతబస్తీలో స్ట్రీట్ ఫైట్.. రెండు గ్యాంగ్‌ల మధ్య వార్
లాక్‌డౌన్ అమలులో ఉండి పటిష్ట బందో బస్తు ఉన్నా హైదరాబాద్‌లో మాత్రం ఆకతాయిలు రెచ్చిపోతూనే ఉన్నారు. పాతబస్తీలో కొంత మంది వ్యక్తులు నిబంధనలు ఏమి పట్టకుండా సినిమా స్టైల్‌లో స్ట్రీట్ ఫైట్‌కు దిగారు. రెండు గ్యాంగ్‌లుగా ఏర్పడి తీవ్రంగా కొట్టుకున్నారు. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేకున్నారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఈడి బజార్ ప్రక్కనే ఉన్న మొయిన్ బాగ్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది.
రాత్రి వేళ పెద్ద పెద్దగా అరుస్తూ.. దాడి చేసుకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న భవానీనగర్ పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కర్ఫ్యూ సమయంలో ఇలా దాడులు చేసుకోవడంతో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గొడవకు గల కారణాలు, ఆ యువకులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. రంజాన్ సమయంలో ఇలా దాడి చేసుకోవడంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.