ఆపదలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వచ్చి ఆదుకునేవారు నిజంగా దేవుళ్లే. వారి దారిన వాళ్లు పోతుంటారు.. దారి మధ్యలో ఏదో విపత్తులో తనకు సంబంధం లేనివారు చిక్కుకుంటారు. అలాంటి వారిని చూసి మాకెందుకులే అనుకునేవారు ఉంటారు. కానీ, కొందరు వారిని కాపడటానికి తమ ప్రాణాలు కూడా అడ్డుపెట్టి పోరాడతారు. అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. బంగ్లా మీదినుంచి జారి పడుతున్న ఓ చిన్నారిని వీధి గుండా పోతున్న ఓ చిరు వ్యాపారి కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
మనప్పరాయ్ గ్రామానికి చెందిన జాన్ పీటర్, జాన్సీ మేరీలు తమ నాలుగేళ్ల కుమారుడు ఎడ్రిక్ ఎజిల్ను, కుమార్తె కవిని ఇంట్లో వదిలేసి బయటకు వెళ్లారు. దీంతో వారిద్దరు కలిసి మేడపైన ఆడుకోవడానికి వెళ్లారు. అటు ఇటు పరుగులు పెడుతూ ఆడుకుంటున్నారు. ఇంతలో ఎజిల్ మేడ మీద నుంచి జారిపోతూ పిట్టగోడ పట్టుకున్నాడు. ప్రాణభయంతో అరవసాగాడు. దీంతో అతని చెల్లి తన చిట్టి చేతులతో అన్నని రక్షించే ప్రయత్నం చేస్తోంది. ఎంత ప్రయత్నించినా అతడిని పైకి లాగలేకపోయింది. దీంతో రక్షించాలని అరించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న మహ్మద్ సాలిక్(41) అనే చిరు వ్యాపారి వారిని చూసి పరుగున అక్కడికి వెళ్లాడు. ఆ పిల్లవాడిని కాపాడాలని గోడ పైకి ఎక్కేందుకు యత్నించాడు. అయితే అంతలోనే బాలుడు గోడ వదిలేసి కిందకు జారాడు. అంతే ఒక్కసారిగా బాలుడిని కింద పడిపోకుండా సాలిక్ అతన్ని గట్టిగా పట్టుకుని అతని ప్రాణాలు కాపాడాడు.