ఓ వైపు వరదలు విజృంభిస్తుంటే, మరోవైపు భూ కంపం న్యూజిలాండ్ దేశాన్ని కుదిపేసింది. దేశంలో గాబ్రియొల్ తుఫాను విధ్వంసం కొనసాగుతుండగానే..బుధవారం భారీ భూ కంపం సంభవించింది. పరాపరౌముకు వాయువ్యంగా 50 కిలోమీటర్ల దూరంలో 76 కిలోమీటర్ల లోతులో భూ కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. లెవిన్,పొరిరువ, ఫ్రెంచ్ పాస్, అప్పర్ హట్, లోయర్ హట్, వెల్టింగ్టన్, వాంగనుయి, వావెర్లీ, పల్మెర్‌స్టర్ నార్త్, ఫీల్డింగ్, పిక్టార్, ఎకెతహున, మాస్టర్‌టన్, మార్టిన్‌బొరో, హుంటర్‌వెల్లి తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్లు చెబుతున్నారు.అయితే ఆస్తి, ప్రాణ నష్టంపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
మరోవైపు గాబ్రియొల్ తుఫాన్ న్యూజిలాండ్‌లో విధ్వంసం సృస్టిస్తోంది. దేశంలోని అధిక ప్రాంతాలు నీటమునిగాయి. ప్రజలు వరదల్లో బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నారు. ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు కూలిపోయాయి.మరోవైపు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దాదాపు 1.25 లక్షల మంది రోడ్డుపైకి వచ్చారు. తుఫాను కారణంగా హాక్స్ బే, కోరమాండల్,నార్త్ ల్యాండ్ వంటి ప్రాంతాలు ఎక్కువగా నష్టపోయాయి. పలువురు తమ ప్రాణాలను కోల్పోయారు. భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా వేలాది ఇళ్లలో విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే అత్యవసర ప్రకటించిన న్యూజిలాండ్ ప్రభుత్వం.. సహాయక చర్యలను ముమ్మరం చేసింది.