చేయూతనిస్తే.. ప్రాణాలు కాపాడతాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

చేయూతనిస్తే.. ప్రాణాలు కాపాడతాడు..

September 6, 2017

ఎంత గొప్ప ఆశయమున్నా దానికి సరైన సమయంలో చేయూత లభిస్తేనే అనుకున్నది సాధ్యం అవుతుంది. నిజామాబాద్ జిల్లా హగ్డోలి గ్రామానికి చెందిన సాయిలు పట్టెపుకు ఒక ఉన్నతాశయం ఉంది. థియేటర్(నాటక) కళతో సాంఘ దురాచారాలను, సాటి మానవుల కష్టాలను తొలగించాలన్నది ఆయన లక్ష్యం. అందుకే డ్రామా థెరపిస్టు కావాలనుకున్నాడు. కష్టపడి చదివి లండన్ యూనివర్సిటీలోని ప్రఖ్యాత రాయల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ స్పీచ్ అండ్ డ్రామాలో సీటు సంపాదించాడు. మాస్టర్స్ ఇన్ డ్రామా అండ్ మూవ్మెంట్ థెరపీ కోర్సులో చేరాడు.

డ్రామా థెరపీలో.. థియేటర్ విధానాలను, సైకాలజీ అంశాలను కలిపి మానసిక సమస్యలున్నవారికి చికిత్స చేస్తారు. ఈ సమస్యలతో బాధపడేవారిని ఆదుకుని, వారి ప్రాణాలు కాపాడాలన్నది సాయిలు లక్ష్యం.

‘నేను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను. మాది వ్యవసాయ కుటుంబం.  మా ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ. మానసిక ఆందోళన, మహిళలపై గృహ హింస, తాగుడు వంటి వ్యసనాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. సైకాలజీద్వారా తప్ప మరోలా వీటిని పరిష్కరించడం సాధ్యం కాదు. మన  దేశంలో మానసిక నిపుణుల కొరత ఉంది. నేను మాస్టర్స్ డిగ్రీ సాధించాక.. డ్రామా థెరపీ ఆధారంగా కమ్యూనిటీ కౌన్సెలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఇలాంటివారికి చికిత్స చేస్తాను.. ’ అని సాయిలు చెప్పాడు.

అయితే మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేయడానికి ఆయనకు తగిన ఆర్థిక వనరులు లేవు. మూడు వేల పౌండ్ల స్కాలర్ షిప్ వచ్చినా అది లండన్ లో అతని కోర్సు ఖర్చుకు ఏ మూలకూ సరిపోదు. దాదాపు రూ. 31 లక్షలు కావాలి. బంధుమిత్రుల నుంచి వడ్డీ కింద కొంత అప్పు తీసుకున్నాడు. అయినా మరో రూ. 16 లక్షలు అవసరముంది.  ప్రభుత్వం కానీ, లేకపోతే ఎవరైనా దయార్ర్ద  హృదయులు కానీ ముందుకొచ్చి సాయం చేయాని సాయిలు కోరుతున్నాడు. ఈ నెల (సెస్టెంబర్ 27) లోపు ఫీజు చెల్లించాల్సి ఉందని, ఆలోపు స్పందించాలని అభ్యర్థిస్తున్నాడు.

ఆయనకు సాయం చేయదలిచనవారు ఈ ఈమెయిల్ అడ్రస్ ను సంప్రదించగలరు..

[email protected]