టీచర్లకు విద్యార్థి షాకింగ్ లేఖ.. రోజూ మందు, సిగరెట్ తాగుతా - MicTv.in - Telugu News
mictv telugu

టీచర్లకు విద్యార్థి షాకింగ్ లేఖ.. రోజూ మందు, సిగరెట్ తాగుతా

March 28, 2022

 

సాధారణంగా టీచర్లకు విద్యార్థులు సెలవు గురించో, అనారోగ్యం గురించో లేఖలు రాస్తారు. కానీ, ఏపీలో ఓ విద్యార్థి మాత్రం మందు, సిగరెట్ తాగుతానంటూ లేఖ రాశాడు. ఆ లేఖను చదివిన టీచర్లు ఆశ్చర్యపోయారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. వివరాలు.. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి మద్యం తాగి ఆ మత్తులోనే స్కూలుకు వచ్చాడు.

గమనించిన టీచర్లు విద్యార్థి తండ్రిని స్కూలుకు పిలిపించి మీ అబ్బాయి ప్రవర్తన బాగాలేదు. మందలించి బుద్ధి చెప్పమన్నారు. ఐతే బాలుడి తండ్రి షాకింగ్ రిప్లై ఇచ్చాడు. మా అబ్బాయి నా మాట వినడం లేదనీ, మీరే అతడిని దారిలోకి తేవాలంటూ చెప్పేసి వెళ్లిపోయాడు. దీంతో టీచర్లు ఆ విద్యార్థిని తప్పుడు ప్రవర్తనకు వివరణ ఇమ్మని ఆదేశించారు. దాంతో ఆ విద్యార్ధి టీచర్లకు ఓ లేఖ రాశాడు. అందులో తాను రోజూ మందు కొడతానని, స్కూలు పక్కన ఉన్న బడ్డీ కొట్టులో సిగరెట్ కొనుక్కొని తాగుతానని రాశాడు. మద్యం కొనేందుకు డబ్బుల కోసం ఇటుక బట్టీలో పనికి వెళ్తున్నానని వివరంగా రాసుకొచ్చాడు. తన తండ్రి రోజూ మద్యం తాగుతాడనీ, అది చూసి తనకు కూడా తాగాలనిపించిందని స్పష్టం చేశాడు. 15 ఏళ్ల తనకు ప్రభుత్వ మద్యం షాపులో మద్యం అమ్మరు కాబట్టి తెలిసిన వారి ద్వారా తెప్పించుకొని తాగుతున్నానని వివరించాడు. చివర్లో మాత్రం ఇకపై ఇలా చేయనని, క్షమించమని కోరాడు. అయితే అదే స్కూలులో ఐదుగురు విద్యార్థులు కూడా రోజూ మద్యం తాగుతున్నారని టీచర్ల విచారణలో తేలింది. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రలకు చేరవేస్తే వారు తమ పిల్లలను వెనకేసుకొస్తున్నారంట. ఈ విషయాన్ని చెప్తూ టీచర్లు వాపోతున్నారు. ఇలాంటి ఘటన గతంలో కర్నూలులో జరిగింది. ఓ విద్యార్థి ఏకంగా క్లాసులోనే మద్యం తీసుకొచ్చి తోటి విద్యార్థుల చేత తాగించడంతో ప్రిన్సిపాల్ వారిని టీసీ ఇచ్చి పంపించేశారు. కాగా, భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థులు పాఠశాలకు వెళ్లే వయసులోనే చెడు అలవాట్లకు లోనవ్వడం పట్ల సర్వత్రా విమర్శ వ్యక్తమవుతోంది.