నీరే ఆమెకు శతృవు.. ఏడ్చినా, స్నానం చేసినా చచ్చిపోతుంది - MicTv.in - Telugu News
mictv telugu

నీరే ఆమెకు శతృవు.. ఏడ్చినా, స్నానం చేసినా చచ్చిపోతుంది

November 27, 2019

డస్ట్ అలర్జీ, ఫుడ్ అలర్జీ ఇలా రకరకాల అలర్జీలు ఉంటాయి. కానీ, అరుదుగా వాటర్ అలర్జీ కూడా ఉంటుంది. అది ఏ స్థాయిలో ఉంటుందో, మనిషిని ఎంత నరకానికి గురి చేస్తుందో చెప్పే కథ ఇది. ఇది చాలా ప్రమాదకరమైన అలర్జీ. ఇది ఉన్నవాళ్లు కన్నీళ్లు కార్చకూడదు, చెమట పట్టేలా పనిచేయకూడదు, చివరికి స్నానం కూడా చేయకూడదు. ఒంటి మీద నీళ్లు పడితే చాలు.. యాసిడ్ పడినట్టే. ఎవరో యాసిడ్ చల్లినట్టు శరీరంపై బొబ్బర్లు ఏర్పడతాయి. 

ఒళ్లంతా దద్దుర్లతో ఎర్రగా మారిపోతుంది. ఈ అరుదైన అలర్జీ ఓ యువతిని పట్టి పీడిస్తోంది. దీంతో పాపం ఆయె స్నానానికి, కన్నీళ్లు పెట్టుకోవడానికి దూరమైంది. చెమట రాకుండా, నీళ్లను జీవితకాల శత్రువును చేసుకుంది. ఆ యువతి పేరు తెస్సా. 

పొరపాటున ఆమె స్విమ్మింగ్‌ పూల్‌లో కూడా దిగదు. వర్షంలో తడవాలని అనిపించినా తడవదు. తడిస్తే తన ప్రాణాలకు గ్యారెంటీ లేదని ఆమెకు మాత్రమే తెలుసు. వాటర్ అలర్జీ కారణంగా ఆమె పొరపాటున నీటిని తాకితే వెంటనే జ్వరం వస్తుంది. నీళ్లు తగిలిన ప్రాంతంలో చర్మం బొబ్బలెక్కుతుంది. చెమట పట్టినా ఆమెకు ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే, ఆమె ఆటలు ఆడటం మానేసింది. ఎక్కువగా నడవడానికి కూడా భయపడుతుంది. దీంతో తన యూనివర్శీటీ క్యాంపస్‌లో కూడా కారులోనే తిరుగుతుంది. 

నీటితో అలర్జీ వస్తుందని ఎవరూ భావించలేరు. శుభ్రంగా ఉండకపోతేనే అలర్జీ వస్తుందని చాలా మంది భావిస్తారు. ఆమె తల్లిదండ్రులు కూడా మొదట్లో అదే అనుకున్నారు. ఆమె స్నానానికి వాడుతున్న సబ్బులు, షాంపూలు మార్చి చూశారు. చివరికి వైద్య పరీక్షల్లో ఆమెకు ‘ఆక్వాజెనిక్ ఆర్టికేరియా’ ఉందని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. ఈ వ్యాధి నివారణ కోసం ఆమె రోజుకు 9 రకాల మాత్రలు మింగుతుంది. ప్రపంచంలో 100 కంటే తక్కువ మందికి మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

ఈ అలర్జీతో ఆమె నెలకు కేవలం రెండు సార్లే స్నానం చేసే సాహసం చేస్తుంది. అది కూడా భయంభయంగా. దీని గురించి తెస్సా మాట్లాడుతూ.. ‘నేను దుఖ్ఖపడని కఠినాత్మురాలిని. నాకిదేం దౌర్భాగ్యమో అర్థంకాదు. చెమట పడితే జ్వరం వచ్చేస్తుంది. నీటి శాతం ఎక్కువగా ఉన్న పళ్లు, ఆహారం తిన్న నా నోరు పుండులా మారిపోతుంది. నీళ్లు తాగితే నా నాలుకపై పుండ్లు వస్తాయి. నాకు ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఈ విషయం తెలిసింది. అయితే, అది నీటి వల్ల వస్తుందని అనుకోలేదు. సబ్బు, షాంపూలు లేదా ఆహారం వల్ల అలర్జీ వస్తుందని నా తల్లిదండ్రులు భావించేవారు. పదేళ్ల వయస్సు వచ్చాక వైద్యులు చికిత్స అందించడం మొదలు పెట్టారు. నా అదృష్టం ఏంటంటే అమ్మానాన్నలు ఇద్దరూ వైద్యులే అవడం’ అని తెస్సా వాపోయింది.