టీచర్, మీరు వెళ్లొద్దు..  పిల్లల రోదనలు - MicTv.in - Telugu News
mictv telugu

టీచర్, మీరు వెళ్లొద్దు..  పిల్లల రోదనలు

November 28, 2019

Students cried while teacher transfer

తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుదే. విద్యాబుద్ధులు నేర్పించే టీచర్ల రుణాన్ని పిల్లలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. వారు దూరమైతే పొగిలి పొగిలి రోదిస్తారు. తాజాగా.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సి.బండపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు టి.వేదవతి బదిలీపై వెళ్తుంటే విద్యార్థులు బోరున విలపించారు. 

మేడమ్‌ మమ్మల్ని వదిలి వెళ్లొద్దంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చివరకు చెప్పలేనంత బాధతోనే ఆమెకు వీడ్కోలు పలికారు. వేదవతి గత మూడేళ్లుగా తెలుగు, సైన్సు, ఇంగ్లిషు సబ్జెక్టులను ఆసక్తికరంగా బోధిస్తూ విద్యార్థులకు చేరువయ్యారు. పాఠశాల అభివృద్ధికి రూ.6 లక్షల సాయం చేశారు. ఓ తరగతి గదిని కూడా నిర్మించారు. పాఠశాలకు దాతలు విరాళాలు అందేలా కృషి చేశారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు కొనిచ్చేవారు. ఆర్థికసహాయం చేసేవారు. మంగళవారం జరిగిన బదిలీల్లో ఆమె పదోన్నతిపై విజయపురం మండలానికి బదిలీ అయ్యారు. రిలీవయ్యేందుకు బుధవారం సి. బండపల్లె పాఠశాలకు చేరుకొన్నారు. ఈ విషయం తెలుకొన్న విద్యార్థులు ఆమె వద్దకు వెళ్ళి వెళ్ళొద్దు మేడం అంటూ కంటతడి పెట్టారు. వారి బాధ చూసి వేదవతి కూడా కన్నీరు పెట్టారు.