Home > విద్య & ఉద్యోగాలు > విద్యార్థుల్లారా..తొందరపడకండి: సబితా ఇంద్రారెడ్డి

విద్యార్థుల్లారా..తొందరపడకండి: సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థిని, విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. మంగళవారం ఇంటర్ పరీక్షల ఫలితాలను ఆమె విడుదల చేసిన విషయం తెలిసిందే. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. "విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించలేదని, మంచి మార్కులు రాలేదని విద్యార్థులెవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు ఏడాది నష్టపోకుండా ఉండేందుకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ సమయంలో విద్యార్థులు మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు తల్లిదండ్రులు వారికి భరోసా కల్పించాలి. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని కళాశాల లెక్చరర్లు నింపాలి" అని ఆమె అన్నారు.

అయితే, నిన్న విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు మనస్థాపంతో ఇప్పటికే 7గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ, ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని విద్యార్థులెవరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

మరోపక్క తెలంగాణలో ఈసారి ఇంటర్ ఫస్టియర్‌లో 63.32 శాతం, ఇంటర్ సెకండియర్‌లో 67.16 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా మొదటిస్థానంలో, హన్మకొండ జిల్లా రెండో స్థానంలో ఉన్నాయి. మే 23న పరీక్షలు జరుపగా, 9 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. కాగా, విడుదల చేసిన ఫలితాల్లో అమ్మాయిలు తమ సత్తా చాటారు.

Updated : 28 Jun 2022 11:20 PM GMT
Tags:    
Next Story
Share it
Top