విద్యార్థుల్లారా.. హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోండి - MicTv.in - Telugu News
mictv telugu

విద్యార్థుల్లారా.. హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోండి

May 19, 2022

ఉస్మానియా విశ్వవిద్యాలయ యాజమాన్యం విద్యార్థులకు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. పీహెచ్‌డీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు వెంటనే తమ తమ హాస్టళ్లను ఖాళీ చేసి, వెళ్లిపోవాలని నోటీసులు జారీ చేసింది. అనుమతులు లేకుండా హాస్టళ్లలో ఉంటున్న అభ్యర్థులను తీవ్రంగా హెచ్చరించింది. 2017కంటే ముందు పీహెచ్‌డీలో జాయిన్ అయిన విద్యార్థుల గడువు ఇప్పటికే ముగిసిందని, గతనెల 18వరకు వన్‌టైమ్ ఛాన్స్ కింద మరో అవకాశం ఇచ్చామని, ఆ గడువు కూడా ముగిసిందని అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు.

అధికారుల వివరాల ప్రకారం.. ‘దాదాపు 1,240 మంది విద్యార్థులు పరిశోధన పూర్తి చేసుకున్నారు. కోర్సు పూర్తి చేసుకున్నా, ఇంకా 300 మంది హాస్టళ్లలోనే నివాసం ఉంటున్నారు. పీహెచ్‌డీ విద్యార్ధులకు ఓల్డ్ పీజీ, న్యూ పీజీ, ఎస్ఆర్ఎస్‌డి హాస్టళ్లు ఉన్నాయి. గడువు ముగిసినా.. హాస్టళ్లలోనే విద్యార్థులు ఉండడంతో మెస్, ఇతరత్రా సదుపాయాల పరంగా వర్సిటీపై భారం పడుతోంది. కొత్త విద్యార్థులకు గదులు కేటాయించే పరిస్థితి లేదు. 2017 తర్వాత కొత్తగా ప్రవేశాలు జరగలేదు. కేవలం కేటగిరీ-1 కింద ప్రవేశాలు మాత్రమే కల్పించాం. వీరికి హాస్టల్ వసతి కల్పించడం ఇబ్బందిగా ఉంది’.

చీఫ్ వార్డెన్ మాట్లాడుతూ..” కొత్తగా ఓయూలో పీహెచ్‌డీలో ప్రవేశాలు తీసుకున్న విద్యార్ధులు వర్సిటీలో రూమ్‌లు ఖాళీ లేక బయట ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నారు. కొత్త విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని నోటీసులు ఇచ్చాం. మానవతా దృక్పథంతో అభ్యర్ధులు హాస్టళ్లను విడిచివెళ్లాలి” అని ఆయన అన్నారు.