విద్యార్థుల్లారా.. ఐదు నిమిషాల ఆలస్యం ఓకే.. ఆ తర్వాత - MicTv.in - Telugu News
mictv telugu

విద్యార్థుల్లారా.. ఐదు నిమిషాల ఆలస్యం ఓకే.. ఆ తర్వాత

May 23, 2022

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి (సోమవారం) పదోవ తరగతి పరీక్షలు మరికొద్దిసేపట్లో ప్రారంభంకానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..”రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. అందులో 5,08,110 మంది రెగ్యులర్, 1,165 మంది ప్రైవేట్ విద్యార్థులు కలిపి మొత్తం 5,09,275 మంది పరీక్షలకు హాజరు కాబోతున్నారు. విద్యార్థులు గంట ముందే (ఉదయం 8:30) నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తాం. గరిష్ఠంగా ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తాం. ఐదు నిమిషాలు (9.35 గంటలు) దాటితే గనుక ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షకు అనుమతించబోం. ప్రశ్నపత్రాలను ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేశాం. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించిన విద్యార్థులు, ఇన్విజిలేటర్లు సహా ఇతర సిబ్బంది పరీక్ష పూర్తయ్యేవరకు కేంద్రాల్లో ఉండాల్సిందే. మధ్యలో బయటికి వెళ్లడం పూర్తిగా నిషేధించం” అని ఆమె అన్నారు.

మరోపక్క ఈ సారి ఇంగ్లిష్ ప్రశ్నపత్రం ఎస్సెస్సీ పరీక్షల్లో అన్ని పేపర్లతో పోల్చితే, కాస్త భిన్నంగా ఉంటుంది. మొత్తం 80 మార్కులకు ఈ పరీక్ష ఉండగా, ఇంగ్లిష్ పేపర్ పార్ట్-ఎను 40 మార్కులు, పార్ట్- బిను 40 మార్కులకు నిర్వహించనున్నారు. ఈ ఒక్కటి మినహా మిగతా అన్ని పేపర్లకు ప్రశ్నలు ఒకే విధంగా ఉంటాయి. ఇంగ్లీష్ పేపర్‌కు బుధవారం పరీక్ష ఉంటుంది. ఆ రోజు విద్యార్థులకు రెండు ప్రశ్నపత్రాలను ఒకేసారి ఇస్తామని, మిగతా సబ్జెక్టులకు మాత్రం బిట్ పేపరు చివరి అరగంటలో ఇస్తామని అధికారులు తెలిపారు.