Students .. Inter results released tomorrow
mictv telugu

విద్యార్థుల్లారా.. రేపే ఇంటర్ ఫలితాలు విడుదల

June 27, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థిని, విద్యార్థులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. ఇంటర్ ఫలితాలను రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ ఫలితాలను ఆదివారం ప్రకటిస్తామని ఇంటర్ బోర్డ్ అధికారులు ప్రకటించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల కారణంగా ఈనెల 28న ప్రకటిస్తామని ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇంట‌ర్ బోర్డ్ కార్య‌ద‌ర్శి జ‌లీల్ మాట్లాడుతూ..” ఇంటర్ ఫలితాలను రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. ఫ‌లితాలు విడుద‌ల చేసిన 15 రోజుల్లోనే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. మొదటగా ఫలితాలను ఆదివారం (26 తేదీన) విడుదల చేస్తామని చెప్పాము. కానీ, కంప్యూటర్‌లో తలెత్తిన కొన్ని అనివార్య కారణాల వల్ల వెల్లడించలేకపోయాము. రేపు కచ్చితంగా ఫలితాలను వెల్లడిస్తాము. విద్యార్థిని, విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ‌లితాల‌ను https://tsbienew.cgg.gov.in/, https://results. cgg.gov.in, https://examresults.ts.nic.inలో చూడండి” అని ఆయన అన్నారు.

తెలంగాణలో మే 6వ తేదీన‌ మొదలైన ఇంటర్ పరీక్షలు మే 24న ముగిశాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,07,393 మంది విద్యా‌ర్థులు హాజ‌ర‌య్యా‌రు. అందులో 4,42,767 మంది సెకం‌డి‌యర్‌ విద్యా‌ర్థులు, 4,64,626 మంది ఫస్టి‌యర్‌ విద్యా‌ర్థులు ఉన్నా‌రు. మొత్తం 1,443 కేంద్రాల్లో పరీ‌క్షలు రాశా‌రు. ఈ క్రమంలో పరీక్షల ఫలితాలు విడుదలైన అనంతరం ఏమైనా సమ‌స్యలుంటే పరి‌ష్కా‌రా‌నికి టోల్‌ఫ్రీ నం.18005999333ను సంప్రదించ‌వ‌చ్చని అధికారులు సూచించారు.