Students..Laptops are not given: RGUKT
mictv telugu

విద్యార్థుల్లారా..ల్యాప్‌టాప్‌లు ఇవ్వం: ఆర్జీయూకేటీ

September 17, 2022

తెలంగాణ రాష్ట్రంలోని బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం(2022-23) నుంచి విద్యార్ధులకు ల్యాప్‌టాప్‌లను ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. తాజాగా యూనివర్సిటీలో జరిగిన టెండర్లలో..ఏకరూప దుస్తులు, బూట్లు, మెస్ తదితర వాటికి టెండర్లు ఆహ్వానించారు. కానీ, ల్యాప్‌టాప్ కొనుగోలుకు మాత్రం టెండర్లను పిలవకపోవడంతో హాట్ టాపిక్‌గా మారింది.

ఐటీ ఆధారిత విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రతి విద్యార్థికీ ల్యాప్‌టాప్‌ను అందించాలని ఆర్జీయూకేటీ గతంలో నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లను అందిస్తూ, వస్తుంది. అయితే, ఈ విద్యా సంవత్సరం(2022-23) నుంచి వాటిని ఇవ్వకూడదని వర్సిటీ నిర్ణయించింది. ఇటీవలే ఆర్టీయూకేటీ విద్యార్థులు 12 డిమాండ్లతో కూడిన ఓ ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించారు. అందులో ముఖ్యంగా ల్యాప్‌టాప్‌లను ఇవ్వాలని కోరారు. దానికి ఒక్కో డిమాండ్‌ను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆనందపడ్డారు. కానీ, వర్సిటీ అధికారులు ల్యాప్‌ట్యాప్‌లు ఇవ్వమని ప్రకటించడంతో విద్యార్థులు అయోమాయంలో పడ్డారు.

”ఏటా 1500 మంది విద్యార్ధులు కొత్తగా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు(రెండేళ్లు ఇంటర్, నాలుగేళ్లు బీటెక్)లో చేరతారు. వారికి ఉచితంగానే ల్యాప్‌టాప్‌ను అందజేయాలి. కోర్సు పూర్తయిన తర్వాత బైబ్యాక్ విధానం ద్వారా మళ్లీ కంపెనీలే వాటిని కొనుగోలు చేస్తాయి. కొత్తవి అయితే, ఒక్కో దాని ఖరీదు రూ. 40 వేల నుంచి రూ.50 వేలు ఉంటుంది. అంటే 1500 మందికి రూ. 6 కోట్లు నుంచి రూ.7.50 కోట్ల వరకు ఖర్చవుతుంది. ప్రతిసారీ టెండర్లు పిలవడం, అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తుండటంతో వర్సిటీ దీనిపై పునఃసమీక్షించుకుంది. ప్రస్తుతానికి ఇంటర్ (పీయూసీ) పూర్తయ్యే వరకు ఇవ్వరాదని, బీటెక్‌లోకి వచ్చిన తర్వాత ఇస్తామని చెబుతున్నా, క్రమేణా ఈ సదుపాయాన్ని బంద్ చేయాలన్నది వర్సిటీ ఆలోచనగా ఉంది.” అని అధికారులు తెలిపారు.