తమకు కులమతాలు లేవన్న 1.24 లక్షల మంది పిల్లలు - MicTv.in - Telugu News
mictv telugu

తమకు కులమతాలు లేవన్న 1.24 లక్షల మంది పిల్లలు

March 28, 2018

మతములన్నియు మాసిపోవును.. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును..’ అని అన్నాడు మహాకవి గురజాడ. కులమతాల పేర్లుతో కమ్ముకుంటున్న, ప్రాణాలు తీసుకుంటున్న మన దేశంలో ఇప్పుడిప్పుడే కాస్త మార్పు వస్తోంది. తమకు కులమతాలు లేవని కేరళలో ఏకంగా 1.24 లక్షల మంది పిల్లలు తేల్చిచెప్పేశారు. కేరళ అక్షరాస్యతలోనే  కాకుండా నవీన భావాల్లోనూ ముందంజలో ఉందని ఈ ఉదంతం చాటుతోంది.

ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సి.రవీంద్రనాథ్ బుధవారం అసెంబ్లీలో స్వయంగా వెల్లడించారు. 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1.24 లక్షల మంది విద్యార్థులు తాము ఏ కులానికి, మతానికి చెందమని తెలిపారని ఆయన వెల్లడించారు.  

1 నుంచి 10వ తరగతి వరకు 9వేల పాఠశాలల నుంచి సమాచారం సేకరించామని, 1,23,630 మంది కులం, మతం పేరును తెలిపే కాలమ్ నింపలేదని తెలిపారు. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థుల్లో 278 మంది, రెండో సంవత్సరం విద్యార్థుల్లో 239 మంది కూడా తమకు కులం, మతం లేదని తెలిపారన్నారు.