తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతావాహన యూనివర్సిటీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆయా యూనివర్సిటీల అధికారులు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కేసీఆర్ సర్కార్ మూడు రోజులపాటు స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలకు సెలవులను ప్రకటించింది.
ఈ క్రమంలో ఆయా యూనివర్సిటీల అధికారులతో చర్చించి, కాకతీయ, ఉస్మానియా, శాతావాహన యూనిర్సిటీల పరిధిలో సోమ, మంగళవారాల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను అధికారులు వాయిదా వేస్తూ, నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఆయా యూనివర్సిటీల రిజిస్ట్రార్లు ప్రకటించారు. కావున విద్యార్థినీ, విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, మళ్లీ పరీక్షల కొత్త తేదీలను ప్రకటించే వరకు పరీక్షలకు ప్రిపేర్ కావాలని సూచించారు.