విద్యార్థుల్లారా.. వచ్చే నెలలోనే ఫలితాలు - MicTv.in - Telugu News
mictv telugu

విద్యార్థుల్లారా.. వచ్చే నెలలోనే ఫలితాలు

May 20, 2022

తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మొదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు గురువారంతో ముగిశాయి. పరీక్షలకు తెలంగాణ వ్యాప్తంగా 9,07,393 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, 1,443 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని సబిత ఇంద్రారెడ్డి గతంలో తెలిపారు. తాజాగా పరీక్షలు ముగియడంతో కొంతమంది విద్యార్థులు ఆనందంగా ఉన్నా, మరికొంతమంది మాత్రం ఫలితాల కోసం ఇప్పటి నుంచే ఎదరుచూస్తున్నారు.

ఈ క్రమంలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ మాట్లాడుతూ..”నెల రోజుల్లోనే (జూన్) ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను వెల్లడిస్తాం. మొత్తం 15 కేంద్రాల్లో 15 వేల మంది అధ్యాపకులతో స్పాట్ వాల్యుయేషన్ నిర్వహిస్తున్నాం. నిర్మల్, సిద్దిపేట, మంచిర్యాలలో కొత్తగా వాల్యుయేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఇంటర్ ప్రధాన పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. 9.7 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. కొన్నిచోట్ల మాత్రమే చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి. కొన్ని ప్రశ్నల్లో ప్రింటింగ్ తప్పిదాలు వచ్చాయి. వచ్చే ఏడాది అవి పునరావృతం కాకుండా చూస్తాం. విద్యార్థులు అధైర్యపడొద్దు, అపోహలను నమ్మొద్దు. ఏమైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800 5999888కి కాల్ చేయండి” అని ఆయన అన్నారు.

మరోపక్క ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీసు పాల్పడుతున్న 12 మందిని గురువారం డిబార్ చేసినట్టు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. వీరిలో నిజామాబాద్‌లో ముగ్గురు, వికారాబాద్‌లో ఒకరు, సంగారెడ్డిలో ఐదుగరు, సిద్దిపేటలో ముగ్గురు డిబార్ కాగా, గురువారం నిర్వహించిన కెమిస్ట్రీ పేపర్ – 2, కామర్స్ పేపర్-2 పరీక్షలకు 3,91,242 మంది హాజరు, 20,541 మంది గైర్హాజరయ్యారు అని అధికారులు తెలిపారు.