విద్యార్థుల్లారా.. తెలుగు తప్పనిసరి: ఎస్సీఈఆర్టీ - MicTv.in - Telugu News
mictv telugu

విద్యార్థుల్లారా.. తెలుగు తప్పనిసరి: ఎస్సీఈఆర్టీ

June 15, 2022

తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ చదివే విద్యార్థిని, విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. ”రాష్ట్ర వ్యాప్తంగా సీబీఎస్ఈ, ఐసీఈఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డుల గుర్తింపు పొందిన స్కూళ్లల్లో ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో తెలుగు పేపర్‌ను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. నిర్దిష్ట మార్కులు పొంది పాస్ కావాల్సి ఉంటుంది. తెలంగాణలో తొలిసారిగా పదోవ తరగతి వార్షిక పరీక్షల్లో తెలుగు పేపర్‌ను తప్పనిసరిగా ప్రవేశపెడుతున్నాం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), ఇంటర్నేషనల్ బోర్డు (ఐబీ), ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్ఈ) బోర్డుల ద్వారా గుర్తింపు పొందిన స్కూళ్లల్లో బహుళభాషా విధానం అమల్లో ఉంది. 1-4 తరగతుల్లో ఏదైనా రెండు భాషలు, 5 నుంచి 8 వరకు త్రిభాషా సూత్రం ప్రకారం.. మూడు భాషలు, 9, 10 తరగతుల్లో ఇంగ్లిష్‌తోపాటు, మరో ప్రాంతీయ భాషను విద్యార్థులు ఎంచుకోవచ్చు”. అని అధికారులు తెలిపారు.

ఇక, తెలంగాణ విషయానికొస్తే.. తెలుగు తప్పనిసరి కావడంతో పదోవ తరగతి విద్యాలోకి ప్రవేశించేవారు ఇంగ్లిష్, తెలుగులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. 5, 10 తరగతులకు రాష్ట్రంలోని అన్ని సెంట్రల్ స్కూళ్లల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 5, 10 తరగతుల్లో తెలుగును తప్పనిసరిగా బోధించాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ తదితర బోర్డుల పాఠశాలల్లోనూ తెలుగును బోధించాలని ఆదేశాలిచ్చింది. ఇందుకు ప్రధాన కారణం.. తెలుగు భాష పరిరక్షణ కోసం పాఠశాలల్లో తెలుగును ఓ సబ్జెక్టుగా బోధించేలా 2018 మార్చి 30న యాక్ట్-10 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. దానిని అమలు చేయాలని సూచిస్తూ, 2018 ఏప్రిల్ 2న జీవో-15ను జారీ చేసింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి దశల వారీగా తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేస్తున్నట్లు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోర్డు అధికారులు తెలిపారు.