సీన్ రివర్స్.. టీచర్లకు విద్యార్థుల మార్కులు - MicTv.in - Telugu News
mictv telugu

సీన్ రివర్స్.. టీచర్లకు విద్యార్థుల మార్కులు

August 30, 2019

teacher's.

ఇప్పటివరకు విద్యార్థులకు ఉపాధ్యాయులు మార్కులు వేశారు. కానీ, ఒడిశాలో సీన్ రివర్స్ అవుతోంది. ఇకపై ఉపాధ్యాయులకు విద్యార్థులు రేటింగ్ ఇవ్వబోతున్నారు. విద్యార్థులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, వేతనాల పెంపు జరుగనుంది. పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు పెంచడానికి, ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని పెంచడానికి ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ప్రతి క్లాస్ తరువాత విద్యార్థులు ఉపాధ్యాయులకు ఫీడ్ బ్యాక్ ఇస్తారు. 

మొత్తం 10 పాయింట్లకు గాను విద్యార్థులు రేటింగ్ ఇవ్వాల్సిఉంటుంది. విద్యార్ధులు ఇచ్చే రేటింగ్‌ను బట్టే ఉపాధ్యాయుల పనితీరుపై ప్రభుత్వం ఓ అంచనాకు వస్తుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఒడిశా పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో రేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం గురించి ఒడిశా విద్యా శాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ మాట్లాడుతూ…‘ఇకపై విద్యార్ధుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నాం. ప్రతి తరగతి గదిలోనూ దీనికి ఓ రిజిస్టర్ ఉంటుంది. ఉపాధ్యాయులు తాము తరగతి గదిలోకి వెళ్లిన సమయం, బయటికి వచ్చిన సమయంతో పాటు ఆ రోజు తాము చెప్పిన పాఠం, హాజరైన విద్యార్ధుల సంఖ్య రాయాల్సి ఉంటుంది..’ అని వివరించారు. ప్రతి క్లాస్ తర్వాత విద్యార్ధుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామనీ.. విద్యార్ధులకు ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం అర్థం కాకపోతే అందులో రాయవచ్చునని ఆయన పేర్కొన్నారు. తద్వారా ఉపాధ్యాయులు తమ బోధనను మెరుగుపర్చుకో వచ్చునని మంత్రి తెలిపారు.