కర్ణాటక రాష్ట్రంలో గతకొన్ని రోజుల క్రితం మొదలైన హిజాబ్ వివాదం అనేక విమర్శలకు దారితీసింది. ఈ వివాదంతో ఒక్కసారిగా ఇటు రాజకీయ నాయకులు, అటు సినిమా యాక్టర్లు, రైటర్లు, విదేశీయులు స్పందించారు. దీంతో హిజాబ్ వివాదం అంతర్జాతీయ సమస్యగా మారడంతో కర్ణాటక హైకోర్ట్.. ”విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు. హిజాబ్ ధరించడం ఇస్లాం మతానికి అత్యవసరమైన ఆచారం కాదు. విద్యార్థులు ప్రోటోకాల్ పాటించాలి” అంటూ ముగ్గురు సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది.
అయితే, ఇప్పటికీ కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. హైకోర్ట్ ఇచ్చిన తీర్పును కొంతమంది విద్యార్ధినులు పట్టించుకోకుండా హిజాబ్‌ను ధరిస్తూ, కాలేజీలకు, పాఠశాలకు హాజరౌతున్నారు. దీంతో కొన్ని కాలేజీల యాజామన్యాలు హిజాబ్‌తో క్లాస్ రూంలకు వచ్చిన విద్యార్థినులను బయటికి పంపిస్తుంటే, మరికొన్ని యాజమాన్యాలు అనుమతి ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా, గదగ్‌లోని సీఎస్ పాటిల్ బాలుర ఉన్నత పాఠశాల, సీఎస్ పాటిల్ బాలికల ఉన్నత పాఠశాలల్లో ఎస్ఎస్ఎల్సీ పరీక్షలకు కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించి పరీక్ష రాశారు. దీంతో హిజాబ్ ధరిస్తే, ఎందుకు అనుమతి ఇచ్చారంటూ పై అధికారులు ప్రశ్నిస్తూ.. ఏడుగురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాకుండా ఇద్దరు సెంటర్ సూపరింటెండెంట్లపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు.