Stunt Master Suresh Dies In Tamil Film Shooting
mictv telugu

షూటింగ్ లో విషాదం.. హీరో విజయ్ సేతుపతి ఫైట్ మాస్టర్ మృతి

December 4, 2022

తమిళ హీరో విజయ్ సేతుపతితో దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న ‘విడుతలై’ చిత్రం షూటింగ్ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. ఈ సినిమాకి పనిచేస్తున్న స్టంట్ మాస్టర్ ఎస్ సురేష్ షూటింగ్ సెట్స్ లో జరిగిన ప్రమాదంలో మరణించారు. డిసెంబర్ 3 శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని సౌత్ ఇండియన్ సినీ స్టంట్ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు తవసి రాజ్ ధృవీకరించారు. భద్రతా జాగ్రత్తలు ఉన్నప్పటికీ, చెన్నైలోని కేళంబాక్కంలో షూటింగ్ సమయంలో ఈ సంఘటన జరిగిందని ఆయన తెలిపారు. ఒక జంపింగ్ స్టంట్ ప్రదర్శిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని.. పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రమాదం జరగటం దురదృష్టకరమని చెప్పారు. ఇక ఫైట్ మాస్టర్ సురేష్‌కు భార్య, కుమార్తె ఉండగా వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు.

‘విదుతలై’ చిత్రం షూటింగ్‌లో భాగంగా తాడుకు వేలాడుతున్న శివ, తాడు తెగిపోవడంతో కింద పడ్డాడు. 20 అడుగుల పైనుంచి కిందకు పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చిత్ర యూనిట్ సురేష్ ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఇక హీరో కార్తీ వడ చెన్నై, ధనుష్ అసురన్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెట్రిమారన్ సురేష్ మృతిపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశాడు. విజయ్ సేతుపతితో తీస్తున్న ఈ ‘విదుతలై’ చిత్రం పోలీసు విభాగంలో రాజకీయాలపై తెరకెక్కుతుంది. వెట్రి మారన్ శైలిలో వివిధ సామాజిక-రాజకీయ ఇతివృత్తాలను చూపెట్టే థ్రిల్లర్ మూవీ కథాంశమని షూటింగ్ దశలోనే క్రేజ్ దక్కించుకుంది ‘విడుతలై’ చిత్రం.