Sub Inspector Aspirant Died Due To Heart Attack In Suryapet District
mictv telugu

ఎస్ఐ కావాల్సిన యువకుడు.. ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేస్తూ..

November 16, 2022

పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా జాబ్ సంపాదించి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడా యువకుడు. కానీ విధి వక్రీకరించి.. ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మంగళవారం ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణ కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ‌లో నివాసం ఉంటున్న శ్రీకాంత్(24) పోలీస్ కావాలని, సబ్ ఇన్‌స్పెక్టర్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు.

తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కొన్ని నెలల కిందట నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాడు. ప్రిలిమినరీ పాసైన వారికి శారీరక, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇది పాసైన వారికి ఎస్ఐ మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ప్రతి రోజు ఉదయం ప్రాక్టీస్ చేసేవాడు శ్రీకాంత్. ఈ క్రమంలో మంగళ‌వారం ఉదయం డిగ్రీ కాలేజీకి వచ్చిన శ్రీకాంత్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి మిత్రులు శ్రీకాంత్ పరిస్థితి గమనించి ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే శ్రీకాంత్ మృతి చెందినట్లుగా తెలిపారు.

శ్రీకాంత్‌ చదువులో రాణిస్తూనే జనగాం క్రాస్‌ రోడ్డులో తల్లిదండ్రులు నిర్వహిస్తున్న వెల్‌కం దాబా హోటల్‌లో రాత్రి సమయంలో పనిచేస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. కుమారుడు పోలీస్ అవుతాడని, ప్రయోజకుడై మ పేరు నిలబెడతాడని భావించిన తల్లిదండ్రులు శ్రీకాంత్ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. సబ్ ఇన్స్‌పెక్టర్ అవుతాడనుకున్న కుమారుడు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.