రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. దీంతో వరదలు గ్రామాలను చుట్టేస్తున్నాయి. వరదల్లో ప్రజలు చిక్కుకుంటున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని కుర్రు గ్రామంలో ఉన్న సదర్మాట్ బ్యారేజ్ వద్ద వరద నీటిలో ఇద్దరు రైతులు చిక్కుకున్నారు. జగిత్యాల్ జిల్లా, మల్లాపూర్ మండలం సిర్పూర్ గ్రామంలో చెందిన పుస మల్లయ్య, చిలేవేరి తిరుపతి అనే రైతులు మేడంపల్లి గ్రామ శివారులో ఆరు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని పంటకు నీరు పారించడానికి వెళ్లారు.
తిరిగి ఇంటికి వస్తుండగా అకస్మాత్తుగా గోదావరి వరద రావడంతో కుర్రు గ్రామంలో నీటిలో చిక్కుకున్నారు. అది గమనించిన స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన ఖానాపూర్ ఎస్ఐ భవాని సేన్, ఖానాపూర్ సీఐ సిబ్బందితో వచ్చి జాలర్ల సహాయంతో వరదలో చిక్కుకున్న రైతులను రక్షించాడు. భవాని సేన్ యూనిఫాం తీసి నీటిలో ఈదుతూ వరదలో చిక్కుకున్న రైతులకు ఒడ్డుపైన తీసుకొని వచ్చారు. దీంతో స్థానిక ప్రజలు పోలీస్ అధికారులను అభినందించారు.