ఒడిశాలోని ప్రముఖ ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్.. ప్రపంచంలోనే అతి పెద్ద ఇసుక హాకీ స్టిక్ రూపొందించాడు. ఆ ఇసుక శిల్పం ఇప్పుడు వరల్డ్ రికార్డ్స్ ఇండియాలో చోటు సంపాదించుకున్నది. పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ ఒక శిల్పి, ఇసుక కళాకారుడు. ఆయన జనవరి 11న పురుషుల హాకీ ప్రపంచకప్ కోసం కర్టెన్ రైజర్ ను నిర్వహించే కటక్ లోని మహానది ఒడ్డున ఈ ఇసుక శిల్పాన్నిచేశాడు. దీంతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
10 జనవరి 2023లో ఈ సైకత శిల్పాన్ని సుదర్శన్ చేశారు. దీని కోసం 5000 హాకీ బంతులను వాడారు. ఈ బంతులతో సహా మొత్తం 105 అడుగుల పొడవున్న అతి పెద్ద హాకీ స్టిక్ ను ఏర్పాటు చేశారు. దీనిముందు హాకీ గ్రౌండ్ కూడా గీశారు. ఈ రికార్డుకు సంజయ్ నార్వేకర్, సుష్మా నార్వేకర్ ప్రత్యేక న్యాయనిర్ణేతగా వ్యవహరించినట్లు వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. పట్నాయక్ 15మంది విద్యార్థుల బృందం సహాయంతో కేవలం రెండు రోజుల్లో ఈ శిల్పాన్ని పూర్తి చేశారు.
శిల్పం ప్రాముఖ్యత కూడా ఉంది. దాని గురించి సుదర్శన్.. ‘ఒడిశా ప్రధాన స్మారక చిహ్నం ఈ శిల్పంలో చూడొచ్చు. అలాగే ఒడిశాలో పాల్గొనే 16 జట్లకు స్వాగతం పలికేలా ఈ సైకత శిల్పం ఉంటుంది. ఈ శిల్పంలో.. 16 జట్ల జెండాలను కూడా చిత్రీకరించాం’ అంటూ చెప్పారు. వరల్డ్ రికార్డ్స్ ఇండియా (డబ్ల్యూఆర్ఐ) అనేది భారతదేశంలోని మొదటి ప్రపంచ రికార్డ్ సంస్థ. జీనియస్ ఫౌండేషన్ దాని వెబ్ సైట్ ప్రకారం భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం.. లాభాపేక్ష లేని రిజిస్టర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతుంది. ఇది గత 10 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల ప్రపంచ రికార్డ్ హోల్డర్ లతో 3500 కంటే ఎక్కువ భారతీయ ప్రపంచ రికార్డులను ధృవీకరించింది.