Sudden death of Forest Minister..Funeral rites today
mictv telugu

అటవీశాఖ మంత్రి హఠాన్మరణం..నేడు అంత్యక్రియలు

September 7, 2022

కర్ణాటక రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఉమేష్ కత్తి హఠాన్మరణం చెందారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో బెంగుళూరు డాలర్స్ కాలనీలోని తన ఇంటిలో కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహూటిన బెంగుళూరులోని రామయ్య అసుపత్రికి తరలించారు. అప్పటికే మంత్రికి స్పృహ లేకపోవడం, శ్వాస తీసుకోకపోవడంతో.. వైద్యులు అత్యవసర చికిత్స విభాగంలో వైద్యం అందించారు. అయినప్పటికీ ఆయన శరీరం స్పందించకపోవడంతో మంగళవారం అర్థరాత్రి 11.40 నిమిషాలకు ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

విషయం తెలుసుకున్న కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మె, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు సంతాపం తెలిపారు. ”ఉమేష్ నాకు తమ్ముడు లాంటివాడు. అతని మరణం రాష్ట్రానికి తీరని లోటు. అతనికి కొన్ని గుండె జబ్బులు ఉన్నాయని తెలుసు. కానీ, ఇంత త్వరగా మమ్మల్ని విడిచి వెళతాడని ఊహించలేదు. అతను రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశాడు. అనేక శాఖలను సమర్థవంతంగా నిర్వహించాడు. ఆయన మరణం రాష్ట్రానికి భారీ నష్టం. మాకు పెద్ద శూన్యతను మిగిల్చాడు. దీనిని పూరించడం చాలా కష్టం’ అని ఆయన అన్నారు.

ఉమేష్ కత్తి.. స్వస్థలం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా, ఖడకలాట గ్రామం. ఆయనకు భార్య లీల, కుమారుడు నిఖిల్, కుమార్తె స్నేహా ఉన్నారు. బెళగావి జిల్లా హుక్కేరి నియోజకవర్గం నుంచి ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయన అయిదుసార్లు మంత్రిగా సేవలందించాడు. ప్రస్తుతం అటవీ, ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా ఉన్నారు.