తాలిబాన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్లో ప్రతీరోజూ బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు వేర్వేరు ప్రాంతాల్లో బాంబు దాడులు జరుగగా, చరిత్రలో తొలిసారి ఓ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఆ సమయంలో ష్పగీజా క్రికెట్ లీగ్లో భాగంగా పామిర్ జల్మీ, బ్యాండ్ ఎ అమీర్ డ్రాగన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా అభిమానులు కూర్చున్న స్టాండ్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఊహించని ఈ ఘటనతో అభిమానులు ఆందోళనకు గురై భయంతో పరుగులు పెట్టగా, చాలా మందికి తీవ్రగాయాలైనట్టు సమాచారం. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమై స్టేడియంలో ఉన్న ఆటగాళ్లను సురక్షితంగా బంకర్లలోకి తరలించారు. ఈ ఘటనను కాబూల్ పోలీసులు అధికారికంగా ధృవీకరించగా, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని వారు ప్రకటించారు. కాగా, బాంబు పేలినప్పుడు ఐక్యరాజ్యసమితికి చెందిన అధికారులు స్టేడియంలో ఉండడం గమనార్హం.